ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతుల నెత్తిన కుచ్చుటోపీ
ఆదుకుంటామంటూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ నాటకాలు
కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేస్తామంటూ హంగామా
ఎకరాకు రూ.20 వేల ఆరి్థక సాయం పైనా గొప్పగా ప్రకటన
31,530 మందికి రూ.120 కోట్లు ఇస్తామని వెల్లడి
అధిక వర్షాలతో 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా
6,222 మందికి రూ.8.21 కోట్ల పంట నష్టపరిహారం ఎగవేత
4 నెలలైనా ఉల్లి రైతుల ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఎవరినైనా ఏమార్చడంలో సీఎం చంద్రబాబును మించినవాళ్లు ఉండరు. గద్దెనెక్కింది మొదలు రైతులను ఉద్ధరిస్తున్నట్లు ప్రకటించే ఆయన.. ఈ ఏడాది మిరప, మామిడి రైతుల మాదిరిగానే ఉల్లి రైతులను కూడా మోసగించారు. ఈ క్రమంలో క్వింటాకు రూ.1,200 మద్దతు ధర ప్రకటన నుంచి ఎకరాకు రూ.20 వేల సాయం వరకు అన్నివిధాలా దగా చేసి ముంచేశారు.
ఖరీఫ్‌లో ధరల పతనంతో తొలుత నష్టపోయింది ఉల్లి రైతులే..! కిలో రూపాయికి కూడా కొనేవారు లేక తీవ్ర నష్టాలు చవిచూశారు. వీరిని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అధిక వర్షాలకు నాణ్యత దెబ్బతినడంతో పాటు మహారాష్ట్ర ఉల్లి పెద్దఎత్తున మార్కెట్‌కు రావడం, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌కు ఎగుమతులు లేకపోవడంతో ఉల్లి ధరలు పతనం అవుతున్నాయని అధికారులు ముందుగా హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
వైఎస్సార్‌సీపీ ఉద్యమంతో...
దెబ్బతింటున్న ఉల్లి రైతులకు వైఎస్సార్‌సీపీ బాసటగా నిలవడంతో ఆగస్టు చివరి వారంలో చంద్రబాబు సర్కారు మద్దతు ధర, కొనుగోళ్ల పేరిట హంగామా చేసింది. ఎకరాకు రూ.లక్షన్నర పెట్టుబడి చొప్పున క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ.1,750 అవుతున్నందున మద్దతు ధర క్వింటా రూ.2 వేలు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు.
కానీ, వారి ఆవేదనను పట్టించుకోకుండా క్వింటా రూ.1,200కు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 29న ప్రారంభించిన కొనుగోళ్లను మూణ్నాళ్ల ముచ్చటగా మార్చింది. నాలుగు రోజులు తిరక్కుండానే ఎలాంటి ప్రకటన చేయకుండానే మూసివేసింది.
ఇదో నాటకం
మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఉల్లి కొనడం వలన ఉపయోగం లేదంటూనే మార్కెట్, మద్దతు ధర మధ్య వ్యత్యాసం మొత్తం రైతుల ఖాతాలో జమ చేస్తామని నమ్మబలికారు. ధరల పతనం అయితే రైతులను ఆదుకునేందుకు ఇదొక్కటే పరిష్కార మార్గం కాదంటూ కబుర్లు చెప్పారు.
సెప్టెంబర్ 20న ఎకరాకు రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయం చేస్తామని గొప్పలు పోయారు. వాస్తవానికి క్వింటా రూ.1,200 చొప్పున కొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.326 కోట్ల భారం పడుతుందన్న ఆలోచనతో ఎకరాకు రూ.20 వేల సాయం ప్రకటనతోనే సరిపెట్టారు. కనీసం అదయినా వెంటనే చెల్లించారా? అంటే అదీ లేదు.
నిలువునా దగా
అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్‌లో లక్షన్నర ఎకరాల్లో ఉల్లి సాగైంది. కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 31,530 మంది రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించి నాలుగు నెలలైనా ఆర్థిక శాఖ అనుమతి లభించలేదు. ఈ కాలంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై నాలుగైదుసార్లు మొక్కబడిగా సమీక్షలు చేసి వదిలేశారు.
క్వింటా రూ.1,200 చొప్పున 1,272 మంది రైతుల నుంచి నేరుగా 6,977 టన్నులు, మార్కెట్, మద్దతు ధరల మధ్య వ్యత్యాసం రూపంలో ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ (పీడీపీ) స్కీమ్ కింద 9,917 టన్నులు సేకరించినట్టు ప్రకటించారు. 4,076 మంది రైతులకు రూ.18 కోట్లు జమ చేయాల్సి ఉండగా.. రూ.10 కోట్లు ఎగ్గొట్టారు. మరోవైపు అధిక వర్షాలతో 21 వేల ఎకరాల్లో ఉల్లి దెబ్బతిన్నట్లు లెక్కతేల్చారు. ఈ మేరకు 6,222 మందికి రూ.8.21 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) చెల్లించాల్సి ఉండగా దానికీ అతీగతి లేదు.


