కంటినిండా కునుకు లేదు | Obstructive sleep apnea is a sleep related disorder in adults | Sakshi
Sakshi News home page

కంటినిండా కునుకు లేదు

Oct 22 2023 5:18 AM | Updated on Oct 22 2023 5:18 AM

Obstructive sleep apnea is a sleep related disorder in adults - Sakshi

సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహా­­రపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్‌ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రా­ణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్‌–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది.

8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్‌ మెడిసిన్‌ రివ్యూ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్‌ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్‌ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నంత్‌ మోహన్‌ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభా­వాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.  

మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్‌ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్‌లో స్లీప్‌ ల్యాబ్‌ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్‌లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. 

ఓఎస్‌ఏ సమస్య అంటే 

  • ఓఎస్‌ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్‌ అందదు. ఈ సమస్యనే స్లీప్‌ అప్నియా అంటారు. 
  • ఓఎస్‌ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు.  
  • సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్‌ఏతోపాటు మధుమేహం, హైపర్‌ టెన్షన్, బ్రెయిన్‌ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.  
  •  ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు.  

ఇవీ ఓఎస్‌ఏ లక్షణాలు  

  • రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం 
  • నోరు ఎండిపోయిన అనుభూతి 
  • గట్టిగా గురకపెట్టడం 
  • తీవ్ర అలసట 
  • ఒత్తిడి, అశాంతి, ఆందోళన 
  • జ్ఞాపకశక్తి తగ్గిపోవడం 
  • మతిమరుపు, చిరాకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement