జీవనాడికి జీరో | Non allocations for Polavaram project | Sakshi
Sakshi News home page

జీవనాడికి జీరో

Jul 24 2024 5:57 AM | Updated on Jul 24 2024 5:57 AM

Non allocations for Polavaram project

జల్‌ శక్తి శాఖకు రూ.21,323.10 కోట్లు.. పోలవరానికి పైసా లేదు

విధ్వంసం.. నిధుల గండం చంద్రబాబు నిర్వాకాల ఫలితమే

నాబార్డు రుణంతో రీయింబర్స్‌ షరతుకు బాబు తలొగ్గడమే ప్రాజెక్టుకు పెనుశాపం

పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును గతంలో చంద్రబాబు చేసిన పాపాలు వెంటాడుతున్నాయనేందుకు తాజా బడ్జెట్‌లో కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడమే నిదర్శనం. జల్‌ శక్తి శాఖకు కేంద్రం బడ్జెట్‌లో రూ.21,323.10 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే  రూ.1,806.18 కోట్లు జల్‌ శక్తి శాఖకు అదనంగా కేటాయించినా పోలవరానికి పైసా కూడా విదల్చలేదు. 

ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడానికి మాత్రం గతంలో చంద్రబాబు చేసిన పాపాలే కారణం. కమీషన్ల దాహంతో ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి మరీ 2016 సెప్టెంబరు 7వతేదీ అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. 

2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పారు. బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని పెట్టిన ఖర్చును రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు తలూపారు. ఫలితంగా 2017–18 నుంచి బడ్జెట్‌లో పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించడం లేదు.

నిధుల గండం
పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి తొలుత పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కు వివరాలు సమర్పిస్తే పరిశీలించి సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)కి పంపుతుంది. సీడబ్ల్యూసీ వాటిని మదింపు చేసి కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపుతుంది. జల్‌ శక్తి శాఖ మరోసారి తనిఖీ చేసి కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిస్తుంది. 

ఆర్థిక శాఖ సంతృప్తి చెందితే బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు సేకరించి ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఏపీ ప్రభుత్వానికి రీయింబర్స్‌ చేయాలని నాబార్డును ఆదేశిస్తుంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం వల్ల పోలవరానికి నిధుల సమస్య ఉత్పన్నమైంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై వడ్డీల రూపంలో పెను భారం పడుతోంది. అదే బడ్జెట్‌ ద్వారా కేటాయింపులు చేసి ఉంటే ఎలాంటి నిధుల సమస్య ఉత్పన్నమయ్యేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

చారిత్రక తప్పిదాలే శాపం
విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం ద్వారా హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేసేందుకు 2014 మే 28న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు చేపడతామని నాడు చంద్రబాబు సర్కారుకు సూచించింది. 

కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని తన బినామీలకు ఇప్పించుకునేందుకు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డారు. 2014 ఏప్రిల్‌ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని, బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చును తిరిగి చెల్లిస్తామని కేంద్రం విధించిన షరతులకు తలొగ్గారు. 

రూ.12,157.52 కోట్లకు మోకాలడ్డు
పోలవరం పనులను దక్కించుకున్నాక కమీషన్లు వచ్చే పనులనే చంద్రబాబు చేపట్టారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే కట్టకుండా ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించి మరో చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా 2019, 2020లో గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌వాల్‌ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. అనంతరం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఆ తప్పిదాలను సరిదిద్ది కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్‌ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. 

దిగువ కాఫర్‌ డ్యామ్‌తోపాటు ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1లో డయాఫ్రమ్‌వాల్, గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022 డిసెంబర్‌ నాటికే వైఎస్‌ జగన్‌ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని అధికార వర్గాలు పలు దఫాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ద్వారా పోలవరానికి నిధులు విడుదల చేయాలన్న వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు 2021–22లో రూ.320 కోట్లు ఇచ్చిన కేంద్రం.. ఆ తర్వాత చంద్రబాబు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం లేదు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ వ్యయాన్ని భరించడంతోపాటు తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని వైఎస్‌ జగన్‌ ఒప్పించారు. 

ఈ క్రమంలోనే తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.52 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర కేబినెట్‌కు గత మార్చి 6న జల్‌ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్‌డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు ఆ నిధులు మంజూరు చేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయంటూ కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ పక్కన పెట్టింది. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేస్తేనే తొలి దశ పనులకు రూ.12,157.52 కోట్ల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. 

పోలవరం ప్రాజెక్టు పనుల వ్యయం (రూ.కోట్లలో)
2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం55,656.87
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు చేసిన వ్యయం 4,730.71
జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం 4,124.64
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటి పారుదల విభాగం కింద కేంద్రం ఇవ్వాల్సింది 46,801.52
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చింది 15,146.28
2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు 31,655.24  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement