
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి నో ఆప్షన్
183 ఖాళీలతో రాష్ట్రంలో అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా గుర్తింపు
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో కాలేజీలో చేరడంపై విద్యార్థుల అనాసక్తి
అధికారుల అసంబద్ధ నిర్ణయాలతో చిరాకు ∙తరచూ క్యాంపస్‌లను మార్చడమే ప్రధాన కారణం
నిత్యం సమస్యలు సృష్టించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో బయటి వ్యక్తుల పెత్తనంతో భ్రషు్టపట్టిపోయింది. కాలేజీలో పచ్చ బ్యాచ్‌ను నాన్ టీచింగ్ సిబ్బందిగా నియమించడం ద్వారా క్యాంపస్ ఎత్తివేత కుట్రలకు ప్రభుత్వం తెరదీసింది. ఏడాది పాటు ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్ అద్దె చెల్లించకుండా నిలిపేసింది. కరెంటు బిల్లులూ చెల్లించలేదు.
మౌలిక సదుపాయాలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు క్యాంపస్‌ను ఎత్తివేసింది. ఈ పరిణామాలతో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరాలంటే విద్యార్థులు భయపడిపోయే పరిస్థితి దాపురించింది. తాజాగా జరిగిన కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా నిలవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు ఉండగా ఒక్కో క్యాంపస్‌కు 1100 సీట్లున్నాయి. ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 5వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరిగింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 598 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇందులో ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి 183 సీట్లు ఖాళీగా మిగిలి రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా నిలిచింది. గతంలో ఎన్నడూ ఇన్ని సీట్లు మిగలలేదని కాలేజీ ఉద్యోగులు చెబుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఈ సీట్లు ఎన్ని భర్తీ అవుతాయో చూడాలి.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిలో ఉన్న మంత్రికి సన్నిహితుడైన ఒక ప్రైవేటు కాలేజీ అధినేత కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. తన గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌గా నియమించినట్లు సమాచారం. అప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగిన ఒంగోలు క్యాంపస్‌లో రచ్చ మొదలైంది. ఆ 50 మంది పచ్చ బ్యాచ్‌కు ఎలాంటి విధులు అప్పగించకుండా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.
క్యాంపస్‌లోని ఎగ్జామ్ సెల్ పక్కనే ఉన్న ఒక గదిని డెన్‌గా మార్చుకున్న సదరు ఎల్లో బ్యాచ్ డ్యూటీ చేయకుండా టీవీలు చూస్తూ టైం పాస్ చేసేవారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కాలేజీ నిబంధనలకు వ్యతిరేకంగా తమ ఇష్టమొచ్చినప్పుడు కాలేజీకి వచ్చి సంతకాలు చేసేసి వెళ్లిపోయేవారని సమాచారం. దీంతో క్యాంపస్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే క్యాంపస్ అద్దె చెల్లించలేదు. దాంతో రూ.2.50 కోట్ల అద్దె బకాయి మిగిలిపోయింది.
కరెంటు బిల్లు సైతం కోటి రూపాయలకు పైగానే చెల్లించకుండా నిలిపేశారు. దీంతో తరచుగా కరెంటు కట్ చేయడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. మోటార్లు కాలిపోయి నీటి సరఫరా ఆగిపోయినా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. రకరకాల సాకులు చూపి రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌ను ఎత్తివేశారు. ఇది విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపిందని కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు.
ఎస్‌ఎస్‌ఎన్‌లో ఆదిలోనే హంసపాదు...
రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఎత్తేసిన తరువాత ఒంగోలులో మిగిలింది ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్. కాలేజీ తరగతులు ప్రారంభం కాకముందే ఇక్కడ మరో పచ్చ బ్యాచ్ రచ్చ రచ్చ చేసి విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ క్యాంటిన్ నిర్వహణను రెండుగా విభజించి ఇద్దరికి ఇచ్చారు.
బాలికల క్యాంటిన్‌ను చవటపాలెం గ్రామానికి చెందిన ఒకరికి, బాలుర క్యాంటిన్‌ను కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. ఈ ఇద్దరూ టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కావడం గమనార్హం. గత బుధవారం బాలికల క్యాంటిన్‌ను తెరవడంతో బాలుర క్యాంటిన్ కాంట్రాక్టర్ గొడవకు దిగారు. 20 మంది యువకులను తీసుకొచ్చి కాలేజీలోకి బలవంతంగా ప్రవేశించి బాలికల క్యాంటిన్ నిర్వాహకురాలి భర్త మీద దాడి చేశారు.
క్యాంటిన్‌లోని వస్తువులతోపాటు ఆహార పదార్థాలను రోడ్డు మీద పడేశారు. ఈ దాడితో కాలేజీలో రిపోరి్టంగ్ చేయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తలిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అసలు క్యాంటిన్ నిర్వహణ బాధ్యతను ఇద్దరికి కట్టబెట్టడం వలన గొడవలు జరిగే అవకాశం ఉందని అంచనా వేయడంలో అధికారులు వైఫల్యం చెందారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఎస్‌ఎస్‌ఎన్ క్యాంపస్‌ను కూడా ఎత్తివేసే క్రమంలోనే అధికార పార్టీ పక్కా ప్రణాళికతో గొడవలు సృష్టించిందని కొందరు విశ్లేషి స్తున్నారు.
సొంత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారో...
ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి తరచుగా క్యాంపస్‌లను మార్చడం. తొలుత ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీలో ఒంగోలు క్యాంపస్‌ను నిర్వహించారు. అక్కడ నుంచి మార్చి ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. అంతా బాగుందనుకుంటున్న విద్యార్థులకు ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం వచ్చి ఒంగోలు క్యాంపస్‌ను నూజివీడుకు మార్చింది. పిల్లి పిల్లను తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నట్లు విద్యార్థులు తరచుగా క్యాంపస్‌లు మారాల్సి రావడంతో చిరాకుకు గురౌతున్నారు.
కొత్తగా చేరే విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడింది. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలను నిర్మించడం ఒక్కటే దీనికి పరిష్కారమని కొందరు అధ్యాపకులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కూడా తరచుగా మాట మారుస్తోంది. తొలుత పామూరులో ట్రిపుల్ ఐటీ కాలేజీని నిర్మిస్తామన్నారు. తాజాగా కనిగిరిలో ట్రిపుల్ ఐటీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
ఒకవేళ మార్కాపురాన్ని జిల్లాగా మారిస్తే కనిగిరి.. మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఒంగోలుకు అసలు ట్రిపుల్ ఐటీ కాలేజే లేకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీకి సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
పోలీసు బందోబస్తు మధ్య క్యాంటిన్ నిర్వహణ..
బాలికల క్యాంటిన్ నిర్వాహకుడి మీద దాడి జరిగిన రోజు రాత్రి జిల్లాకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే నివాసంలో అర్ధరాత్రి వరకు రాజీ ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. అంతా అయిపోయింది. తెల్లారేసరికల్లా ఇద్దరూ కలిసిపోయారని చెప్పారు. ఈ లోపు ఏం జరిగిందో ఏమో కానీ దాడికి గురైన బాలికల క్యాంటిన్ నిర్వాహకులు శుక్రవారం సంతనూతలపాడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టినట్లు సమాచారం.
అదే రోజు క్యాంపస్‌కు వచ్చిన పోలీసులు విచారణ జరిపి దాడి తాలుకు సీసీ ఫుటేజీలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి పోలీసు బందోబస్తు మధ్య బాలికల క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారని సమాచారం. కాలేజీ క్యాంపస్‌లో పోలీసు పహారా మధ్య విద్యార్థులు భోజనాలు చేయడానికి భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ అధికారుల వైఫల్యం వల్లనే ఇలాంటి దౌర్భాగ్యం నెలకొందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.