నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు సస్పెండ్‌

NIT Director CSP Rao suspended - Sakshi

అవినీతి, అధికార దుర్వినియోగంపై కేసులు నమోదు చేసిన సీబీఐ

సీఎస్పీ రావుపై చర్యలు తీసుకుంటూ కేంద్ర విద్యా శాఖ ఆదేశాలు  

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావును కేంద్ర విద్యా శాఖ సస్పెండ్‌ చేసింది. సీఎస్పీ రావుపై రాష్ట్రపతితో పాటు కేంద్ర ఉన్నత విద్యా శాఖకు అందిన ఫిర్యాదులను సీబీఐ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా సీఎస్పీ రావును సస్పెండ్‌ చేస్తున్నట్టు మార్చి 29న ఇచ్చిన ఆదేశాలు.. బుధవారం నిట్‌ కార్యాలయానికి చేరాయి. వివరాలు.. నాగాలాండ్‌ నిట్‌లో పనిచేసే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ధనలక్ష్మి.. పుదుచ్చేరిలో పోస్టింగ్‌ కోసం సీఎస్పీ రావుకు రూ.5.55 లక్షలు ఇచ్చారంటూ ఫిర్యాదులు అందడంతో ఫిబ్రవరి నెలలో ఏపీ నిట్, కాజీపేటలో సీబీఐ దర్యాప్తు చేసింది.

సీఎస్పీ రావు నిట్‌ డైరెక్టర్‌గా ఉంటూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ, అనర్హులకు ఉద్యోగాలిచ్చారని సీబీఐ ఫిబ్రవరి 16న రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. నిట్‌కు పీఆర్వో పోస్టు మంజూరు కాకపోయినా దానిని భర్తీ చేశారని.. సూపరింటెండెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకంలో వయసు నిబంధనను పాటించలేదని సీబీఐ పేర్కొంది. వీరేశ్‌కుమార్‌ అనే వ్యక్తికి వయోపరిమితి సడలించి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారని తెలిపింది. 

పోస్టింగ్‌లకు లంచాలు..
నిట్‌కు క్యాటరింగ్‌ సర్వీస్‌ చేసే అవకాశమిచ్చినందుకు ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌ అనే సంస్థ నుంచి లంచం తీసుకొన్నారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. పీహెచ్‌డీ గైడ్‌గా వ్యవహరించినందుకు ఎన్‌.విష్ణుమూర్తి నుంచి రూ.1.50 లక్షలు, ఒక వ్యాయామ పరికరాన్ని లంచంగా తీసుకున్నారని తెలిపింది. లంచాలుగా తీసుకున్న సొమ్మును వేరే ఖాతాల్లోకి మళ్లించారని వెల్లడించింది. సీఎస్పీ రావుతో పాటు పీఆర్వో రాంప్రసాద్, సూపరింటెండెంట్‌లు చెక్కలపల్లి అన్నపూర్ణ, కాపాక గోపాలకృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ వీవీ సురేష్‌బాబు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరేష్‌కుమార్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ధనలక్ష్మి, ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌ నేరెళ్ల సుబ్రహ్మణ్యం, ఎన్‌.విష్ణుమూర్తిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top