సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం  | Sakshi
Sakshi News home page

సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం 

Published Sun, Apr 14 2024 5:06 AM

Nirmala Secured 421 marks out of 440 in BIPC in the inter results - Sakshi

పేదరికంతో చదువుకు దూరమైన కర్నూలు జిల్లా బాలిక నిర్మల 

పదో తరగతిలో 537 మార్కులు సాధించినా ఆ ర్థిక పరిస్థితులతో చదువుకు దూరం 

తల్లిదండ్రులతో కలిసి కూలిపనులకు వెళ్తున్న బాలికకు అండగా నిలిచిన ప్రభుత్వం 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి సమస్య 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చొరవతో కేజీబీవీలో చేర్పించిన కలెక్టర్‌ సృజన 

తాజాగా ఇంటర్‌ ఫలితాల్లో బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన నిర్మల 

చదువులోనే కాదు ఆటల్లోనూ మేటి.. రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపిక 

ఐపీఎస్‌ సాధించడమే తన లక్ష్యమని వెల్లడి 

ఆదోని రూరల్‌/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్‌లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్‌ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్‌గా నిలిచింది. ‘కార్పొరేట్‌ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. 

కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కు­లు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరు­పేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్‌ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావా­ణి, తహసీల్దార్‌ వెంకటలక్షి్మని ఆదేశించారు.

మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్‌ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మ­ల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అంది­స్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్‌ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్‌ సృజన ప్రత్యేకంగా అభినందించారు.  

ఐపీఎస్‌ కావాలన్నదే నా జీవిత ఆశయం 
ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్‌ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్‌ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్‌ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం.      – నిర్మల, విద్యా ర్థిని  

చాలా గర్వంగా ఉంది.. 
నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్‌ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్‌ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్‌ స్మైలీ,  ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా

Advertisement
 
Advertisement