ఇంజనీరింగ్, ఫార్మసీల్లో.. ఏపీకి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్, ఫార్మసీల్లో.. ఏపీకి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు

Published Sat, Jul 16 2022 11:21 AM

NIRF Ranks For AP In Engineering And Pharmacy - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ఉన్నత విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరంలో కూడా ‘నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో గతంలో కన్నా ఈసారి ఎక్కువ సంస్థలు ర్యాంకుల సాధనలో ముందంజలో ఉన్నాయి. పది అంశాలను ప్రామాణికంగా తీసుకుని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఈ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులను ఏటా ప్రకటిస్తోంది. ఈ రెండు విభాగాల్లో ఏపీకి చెందిన సంస్థలు గతంలో కన్నా ఎక్కువగా ఎంపికయ్యాయి.
చదవండి: సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్‌ అధ్యాపకులు

మరోవైపు.. ఓవరాల్‌ విభాగంలో స్కోరు సాధించిన ఆంధ్రా యూనివర్సిటీ టాప్‌ 100లో చోటు సంపాదించింది. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) 47.97 స్కోరు పాయింట్లతో 71వ ర్యాంకు సాధించింది.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం ఈ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2022 ర్యాంకులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ర్యాంకుల కోసం 1,875 సంస్థలు పోటీపడ్డాయి. యూనివర్సిటీల విభాగంలో ఏపీలోని 5 సంస్థలకు ఈ ర్యాంకులు దక్కాయి. ఆంధ్రా యూనివర్సిటీ 50.52 స్కోరుతో 36వ ర్యాంకు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి)æ 45.07 స్కోరుతో 67వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. కాలేజీల విభాగంలో విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఒక్కటే నిలిచి 94వ స్థానాన్ని దక్కించుకుంది.

‘ఇంజనీరింగ్‌’ విభాగంలో పెరిగిన ర్యాంకులు
ఇంజనీరింగ్‌ కాలేజీల విభాగంలో ఈసారి రాష్ట్రానికి ఎక్కువ ర్యాంకులు దక్కాయి. గత ఏడాది ఏపీలోని ఆరు సంస్థలు చోటు సంపాదించుకోగా ఈసారి ఆ సంఖ్య పదికి పెరిగింది. ప్రభుత్వ సంస్థలైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఏయూ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (విశాఖపట్నం) 42.76 స్కోరుతో 77వ ర్యాంకు, జేఎన్‌టీయూ కాకినాడ 37.79 స్కోరుతో 129వ ర్యాంకు సాధించాయి. మేనేజ్‌మెంటు విభాగంలో విశాఖపట్నంలోని జాతీయ విద్యాసంస్థ అయిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు సంస్థ 33వ ర్యాంకులో నిలిచింది. ఫార్మసీ విభాగంలో రాష్ట్రానికి తొమ్మిది ర్యాంకులు దక్కాయి. ప్రభుత్వ సంస్థలైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్సు (గుంటూరు)కు 51వ ర్యాంకు, తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 66, శ్రీ వేంకటేశ్వర వర్సిటీకి 89వ ర్యాంకు లభించాయి. ఇక ఆర్కిటెక్చర్‌ విభాగంలో విజయవాడలోని జాతీయ విద్యాసంస్థ అయిన స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా–ఎస్‌పీఏ) 7వ స్థానంలో నిలిచింది. 

హైదరాబాద్‌ ఐఐటీ అదుర్స్‌
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్‌) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ (హెచ్‌) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్‌ లభించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల విభాగంలో ఐఐటీ (హెచ్‌) టాప్‌–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. అలాగే పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. యూనివర్సిటీల వారీగా చూస్తే జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. ఓవరాల్‌ విభాగంలో 20వ ర్యాంకును, రీసెర్చ్‌ విభాగంలో 27వ ర్యాంకును సాధించింది. మరోవైపు వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంకు పొందింది.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement