
బిడ్డకు 100 శాతం వైకల్యం ఉన్నా అధికారులు దయచూప లేదు
పింఛన్ రాకుండానే ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదేళ్ల చిన్నారి
మెళియాపుట్టి : ఆ బాలుడికి కాళ్లు, చేతులు పనిచేయవు. వినిపించదు కూడా. 2024లో శ్రీకాకుళం రిమ్స్ ప్రభుత్వ వైద్యులు అతడికి వందశాతం వైకల్యం ఉందని నిర్ధారించారు. కానీ ప్రభుత్వం అతడికి పింఛన్ మంజూరు చేయలేదు. కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు పింఛన్ ఇచ్చినా తీసుకునేందుకు ఆ బాలుడు లేడు. మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామానికి చెందిన అగ్గాల పార్వతి, సునీల్ కుమార్‌ల ఒక్కగానొక్క కుమారుడు సందీప్(9) పూర్తిగా దివ్యాంగుడు.
బాణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు దివ్యాంగ సరి్టఫికెట్ తీసుకుని పలుమార్లు మండల పరిషత్, సచివాలయాలకు తిరిగినా పింఛన్ మాత్రం రాలేదు. మూడు రోజుల కిందట విద్యార్థి తీవ్రమైన జ్వరంతో పలాసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. దీంతో బిడ్డ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.