నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు

Nimmagadda Ramesh Kumar Behaviour Over Press Meet Troll - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయంటూనే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు పలు విజ్ఞప్తులు చేసినప్పటికి.. పరిగణలోనికి తీసుకోని ఆయన.. హైకోర్టు తీర్పుననుసరించి ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం వెలువరించారు. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ తీసుకున్న కోవిడ్‌ జాగ్రత్తలు చర్చనీయాంశమయ్యాయి. సమావేశం సందర్భంగా ఆయన మాస్క్‌ ధరించి.. గ్లాస్‌ షీల్డ్‌ కవర్‌ వెనుక కూర్చుని నోటిఫికేషన్‌ వివరాలు వెల్లడించారు. ఇక సమావేశానికి ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేయించారు.

ఈ క్రమంలో నిమ్మగడ్డ తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశానికే నిమ్మగడ్డ తన రక్షణ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. మరి లక్షల మంది ప్రజలతో ముడిపడ్డ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఎన్నికల సిబ్బంది.. ఓట్లు వేసే ప్రజల ఆరోగ్యం గురించి ఆయనకు ఎలాంటి బాధ్యత లేదా.. ఆయన ఒక్కరిదే ప్రాణం.. జనాలది కాదా అని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నిమ్మగడ్డ.. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న సమయంలో ఇంత మొండిగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆడుతున్న నిమ్మగడ్డకు ప్రజల రక్షణ గురించి పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
(చదవండి: అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్‌..)

మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పని నిమ్మగడ్డ
ఎన్నికలప్రక్రియకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అరగంట సేపు ప్రసంగం చేసి మీడియా సందేహాలను.. నివృత్తి చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. మీడియా సందేహాలను నివృత్తి చేయటం ఆనవాయితి. ఇందుకు భిన్నంగా నిమ్మగడ్డ తాను రాసుకొచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని కాదని ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తున్నారు. ఇక మీడియా సమావేశం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ పలు ఆరోపణలు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ఇంకా మెరుగైన పనితీరు కనబరచాలని.. తన పనుల్లో పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు.

మూడేళ్ల కాలయాపన తర్వాత ఇప్పుడు అకస్మికంగా
2018 ఆగస్టులోనే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల కాల పరమితి ముగిసింది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న నిమ్మగడ్డ.. అప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా మూడేళ్లుగా కాలయాపన చేశారు. 2019లో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. స్థానిక సంస్ధల ఎన్నికల‌ నిర్వహణకు సిద్ధం అయ్యింది. గతేడాది మార్చిలో స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీని ప్రభుత్వం కోరినా.. ఓటర్ల జాబితా తయారు కాలేదంటూ ఎస్‌ఈసీ అప్పట్లో మెలిక పెట్టింది. కరోనా సాకుతో కేవలం ఆరు కేసులు నమోదైన సమయంలో ఎస్‌ఈసీ గతేడాది ఆకస్మికంగా జడ్పీ ఎన్నికలు వాయిదా వేసింది. మూడేళ్లగా ఎన్నికలు‌ నిర్వహించకుండా తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఉద్యోగ సంఘాల అభ్యర్ధనలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్టించుకోకుండా.. ఎస్‌ఈసీ ఏకపక్షంగా ముందుకెళ్తోంది అంటూ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top