సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి'

NHAI plan with Rs 2000 crore Visakhapatnam-Bhogapuram Beach - Sakshi

ఆరులేన్లుగా విశాఖ–భోగాపురం బీచ్‌ కారిడార్‌ 

నాలుగు లేన్లుగా పోర్ట్‌ టెర్మినల్‌ రహదారి నిర్మాణం  

రూ. 2 వేల కోట్లతో ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక 

బీచ్‌ కారిడార్‌ భూసేకరణకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం 

లాజిస్టిక్‌ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందేందుకు దోహదం 

పర్యాటక, ఐటీ ప్రాజెక్టులకు నెలవుగా మారుతుందని అంచనా

సాక్షి, అమరావతి:  విశాఖపట్నంలో సుందర సాగర తీరాన్ని ఆనుకుని ఆరులేన్ల సువిశాల రహదారి రానుంది. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే విశాఖపట్నం పోర్ట్‌ టెర్మినల్‌ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించి దానిని బీచ్‌ కారిడార్‌కు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ విశాఖపట్నం బీచ్‌ కారిడార్‌ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించే ప్రక్రియ చేపట్టింది.  
 
రెండు దశలుగా బీచ్‌ కారిడార్‌.. 
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సన్నద్ధమైంది. దానిలో భాగంగా విశాఖపట్నం బీచ్‌కారిడార్‌ను నిర్మించనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండు దశలుగా బీచ్‌కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటిగా విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును అనుసంధానిస్తూ బీచ్‌కారిడార్‌ను 20.20 కి.మీ. మేర ఆరు లేన్లుగా నిర్మిస్తారు.

విశాఖపట్నంలో రుషికొండ, ఎండాడ, భీమిలి ప్రాంతాలు పర్యాటక, ఐటీ రంగాలకు కేంద్రస్థానంగా మలచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ బీచ్‌కారిడార్‌ నిర్మాణం ఎంతగానో ఉపకరించనుంది. ఈ బీచ్‌ కారిడార్‌ వెంబడి పర్యాటక ప్రాజెక్టులు, దిగ్గజ ఐటీ, కార్పొరేట్‌ సంస్థలు కొలువు దీరేందుకు సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఈ బీచ్‌ కారిడార్‌ చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆరులేన్ల బీచ్‌ కారిడార్‌ నిర్మాణానికి సుముఖత తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్‌ రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ బీచ్‌ కారిడార్‌ కోసం దాదాపు 346 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. అందుకు దాదాపు రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.  
 
పోర్ట్‌ను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి... 
ఇక ఈ ప్రాజెక్టులో రెండో దశ కింద బీచ్‌ కారిడార్‌ను విశాఖపట్నం పోర్టుతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌ను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఆ రహదారిని విశాఖపట్నం–భోగాపురం బీచ్‌కారిడార్‌కు అనుసంధానిస్తారు. అంటే పోర్ట్‌ టెర్మినల్‌ నుంచి బీచ్‌ కారిడార్‌ ప్రారంభం వరకు నాలుగు లేన్ల రహదారి.. అక్కడ నుంచి తీరాన్ని ఆనుకుని విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

ఆరు లేన్ల బీచ్‌ కారిడార్, నాలుగు లేన్ల విశాఖపట్నం పోర్ట్‌ టెర్మినల్‌ రహదారికి కలిపి దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుతో ప్రధానంగా విశాఖపట్నం పోర్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించడం సాధ్యమవుతుంది. దాంతో సరుకు రవాణాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని, విశాఖపట్నం లాజిస్టిక్‌ హబ్‌గా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం పోర్ట్‌ టెర్మినల్‌ నుంచి బీచ్‌ కారిడార్‌ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై కూడా జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ త్వరలో డీపీఆర్‌ ప్రక్రియ చేపడుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెప్పాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top