పారిశ్రామిక ప్రగతితో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తోంది. ఫలితంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుతో పాటు సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది.
ఒంగోలు అర్బన్: జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు సీడీపీ (క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)లతో జిల్లా ప్రకాశించనుంది. ఆ మేరకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన యువతకు ఉపాధి కలి్పంచేలా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాలో 2022–23 సంవత్సరంలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో సుమారు 1600 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది.

పరిశ్రమలకు చేయూత:  
జిల్లాలో ఇప్పటికే 25 భారీ పరిశ్రమలు, 2899 ఎంఎస్‌ఎంఈ (చిన్న, మధ్య తరహా) పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో భారీ పరిశ్రమల్లో సుమారు 8 వేల మంది, ఎంఎస్‌ఎంఈల్లో 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ పరిశ్రమలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. 2019 నుంచి జిల్లాలో 1406 పరిశ్రమలకు రాయితీ కింద రూ.171.07 కోట్లు అందజేసింది. 2019–20లో 242 పరిశ్రమలకు రూ.23.76 కోట్లు, 2020–21లో 220 పరిశ్రమలకు రూ.48.26 కోట్లు, 2021–22లో 375 పరిశ్రమలకు రూ.33.6 కోట్లు, 2022–23లో ఇప్పటి వరకు 569 పరిశ్రమలకు రూ.65.98 కోట్లు రాయితీ ఇచ్చింది. 
ఎంఎస్‌ఎంఈ పార్కులతో కొత్త పరిశ్రమలు: 
జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. 99.27 ఎకరాల్లో రూ.201.22 కోట్ల వ్యయంతో ఎంఎస్‌ఎంఈ పార్కులు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దొనకొండ మండలం రాగముక్కలపల్లి, పామూరు మండలం మాలకొండాపురం వద్ద ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పార్కులు సిద్ధమైతే వీటిలో సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.  
సీడీపీలతో పరిశ్రమలకు అండగా... 
క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)లతో పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా ఏర్పాటు చేయనున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ వద్ద రెండు సీడీపీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. చీమకుర్తిలో ఏర్పాటు చేసే సీడీపీ గ్రానైట్ పరిశ్రమలకు, గ్రోత్‌సెంటర్‌లో ఏర్పాటు చేసే సీడీపీ నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉండనున్నాయి.  
15 ఏళ్లకు ప్రణాళికలు  
జిల్లాలో ఉన్న వనరుల మేరకు భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా నెలకొల్పేందుకు యువతను ప్రోత్సహించడం అవసరమైన నైపుణ్య శిక్షణలు ఇవ్వడం, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అండగా ఉండటం వంటి చర్యలపై రాబోయే 15 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలను కలెక్టర్ సిద్ధం చేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో కొత్తగా పరిÔశ్రమలు నెలకొల్పేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 
వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ముందుకు రావాలి 
పరిశ్రమలు స్థాపించేందుకు యువత వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రావాలి. అలా వచ్చిన యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తాం. తద్వారా వాళ్లు ఎదగడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కలి్పంచవచ్చు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్నీ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తోంది. రాయితీలు అందిస్తోంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన వాటిలో నైపుణ్య శిక్షణ ఇస్తూ జిల్లాలోనే యువతకు ఉపాధి కలి్పంచడంతో పాటు పరిశ్రమలకు మ్యాన్‌పవర్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నాం. 
– ఏఎస్ దినే‹Ùకుమార్, కలెక్టర్  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
