
నేవీ షిప్స్‌కు దిక్సూచిగా కొత్త యాప్
పనోరమ వెర్షన్ 3.0 పేరుతో అందుబాటులోకి
వార్‌షిప్స్, సబ్‌మెరైన్లకు వాతావరణ సమాచారం అందించేలా తయారీ
తుఫాన్లు, పిడుగుల హెచ్చరికలు జారీ చేసే సాంకేతికత
ఆత్మనిర్భర్ భారత్ కింద నేవల్ ఓషనాలజీ ఆధ్వర్యంలో రూపకల్పన
రియల్‌టైమ్ మల్టీమోడల్ వెదర్, ఓషియన్ ఫోర్‌కాస్ట్ సమాచారం
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో నిత్యం పహారా కాసే యుద్ధ నౌకలు, సాగర గర్భంలో శత్రువుల్ని మట్టుబెట్టాలనే లక్ష్యంతో గస్తీ కాసే సబ్‌మెరైన్‌లకు కొన్ని సందర్భాల్లో సరైన వాతావరణ సమాచారం అందడం లేదు. ఫలితంగా నడిసముద్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు అందిస్తూ.. వార్‌షిప్‌లని అప్రమత్తం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సరికొత్త యాప్‌ని అందుబాటులోకి తీసుకొచి్చంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నేవల్ ఓషనాలజీ ఆధ్వర్యంలో పనోరమ వెర్షన్ 3.0 అప్లికేషన్ రియల్‌టైమ్ మల్టీమోడల్ వెదర్ అప్లికేషన్‌గా వ్యవహరించనుంది.
వాతావరణ సమాచారం పక్కాగా..
పనోరమా వెర్షన్ 3.0 ద్వారా సమగ్ర వాతావరణ సమాచారం ముందస్తుగానే అందించేలా డిజైన్ చేశారు. దీనిని ఇండియన్ నేవీకి చెందిన నేవల్ ఓషనాలజీ, భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్(బీఐఎస్‌ఏజీ అండ్ ఎన్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీని ద్వారా నేవీ సిబ్బందికి వాతావరణ సమాచారం పక్కాగా అందనుంది.
విపత్కర సమయంలో సముద్రంలో నేవిగేషన్‌గా కూడా వినియోగించవచ్చు. ఇండియన్ నేవీ డిజిటల్ విజన్, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ అప్లికేషన్‌ని రూపొందించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఈ అప్లికేషన్‌ని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు.