
ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్‌కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్‌లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్‌పై మైపాడుబీచ్‌కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.
ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.