విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్‌ ప్రతాపం

Narayana college student beaten by lecturer in Vijaywada - Sakshi

సాక్షి, పటమట (విజయవాడ): విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కాలితో తన్నిన ఘటనను మరువక ముందే నగరంలోని నారాయణ కళాశాలలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని లెక్చరర్‌ తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి..

విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయి. అయితే, మార్కులు ఎందుకు తగ్గాయంటూ ప్రసాదరావు అనే లెక్చరర్‌ శుక్రవారం మధ్యాహ్నం సదరు విద్యార్థిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం గమనించిన ఆ లెక్చరర్, కళాశాల ప్రతినిధి కోటితో కలిసి అతన్ని(చిత్రీకరిస్తున్న విద్యార్థి) తీవ్రంగా కొట్టారు.

అంతేగాక వారిద్దరినీ వేరే తరగతి గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించడమేగాక సెల్‌ఫోన్‌ లాక్కొని పగులకొట్టారు. జరిగిన ఘటనను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేంద్ర చెప్పారు.  

చదవండి: (ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్‌.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top