
మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి భర్త ఇంటి వద్ద విడిచిపెట్టిన భార్య
హత్యకు సహకరించిన తమ్ముడు
నంద్యాల: భర్తను తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది ఓ మహిళ. నంద్యాల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి రమణయ్య పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు.
అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.