
బాత్రూంలోకెళ్లి దాక్కున్నా.. అల్లరిమూకలు బీభత్సం చేశారు
నా కళ్ల ముందే విధ్వంసం సృష్టించారు
నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు..
నా బిడ్డ, మనవడ్ని చంపేస్తారేమోననే భయంతో ఏడ్చా.
నల్లపరెడ్డి కుటుంబాన్నే అంతం చేస్తానంటారా?
ప్రశాంతమ్మ సమాజానికి ఏ సందేశమివ్వాలనుకున్నారు?
మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్న తల్లి శ్రీలక్ష్మమ్మ ఆవేదన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘రాత్రిపూట వందలాది మంది వచ్చి నా ఇంట్లో పడ్డారు. కర్రలు, కత్తులు, సమ్మెటలతో నానా బీభత్సం చేశారు. ఇంటి గోడలు తప్ప ఏమీ మిగల్చలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పనిచేసే వారొచ్చి అమ్మా గది నుంచి బయటకు రావొద్దు.. చంపేస్తారమ్మా అంటూ లాక్ వేశారు. ఏమి జరుగుతోందోనని బయటకు చూశా. కేకలు, అరుపులు, చంపేస్తామంటూ బండబూతులు.. నా నోటితో చెప్పలేను. ఆ పరిణామాలు చూసి భయమేసింది. అసలే కంటి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నా. నన్నూ చంపేస్తారనుకుని బాత్రూమ్‌లోకి వెళ్లా. కరెంట్ తీసేశారు.
భయానక వాతావరణాన్ని చూసి నా బిడ్డ, మనవడ్ని చంపేస్తారేమోననే భయంతో ఏడ్చా. 85 ఏళ్ల వయస్సులో ఇలాంటి ఘటనను చూస్తాననుకోలేదు’.. ఇది వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి మాజీ మంత్రి దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సతీమణి శ్రీలక్ష్మమ్మ కన్నీటితో చెప్పిన మాటలు. ‘సాక్షి’ ప్రతినిధితో గురువారం ఆమె మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..
ప్రశాంతిరెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది..
80 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. పేదల కోసం పనిచేసిన చరిత్ర నల్లపరెడ్లది. ధనబలం, అధికార అహంకారంతో రాజకీయాల్లోకొచ్చి ప్రజాస్వామ్యాన్ని గబ్బు పట్టించిన ప్రశాంతిరెడ్డి తీరు ప్రజాస్వామ్యంలో సరికాదు. నల్లపరెడ్ల కుటుంబాన్నే లేకుండా చేస్తానంటూ సవాలు విసిరి.. మితివీురిన గూండాయిజం, రౌడీయిజం చేశారు. మా కుటుంబానికి ప్రశాంతిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది. రౌడీ రాజకీయాలతో రాజ్యమేలాలనుకుంటున్న ఆమె సమాజానికి ఏ సందేశామివ్వలనుకుంటున్నారో అర్థంకావడంలేదు.
వాడెక్కడ.. వాడిని చంపేయాలన్నారు..
ఇంటికొచ్చి తలుపులు తట్టారు. నా కుమారుడు ప్రసన్నను తిడుతూ వందల మంది బీభత్సం చేశారు. ఎక్కడ దాచావో చెప్పు.. వాడెక్కడ.. వాడిని చంపేయాలన్నారు. ఆ మనిషి మా ఇంటికి పంపించింది చంపేసి రమ్మనే. అయితే, బాత్రూంలో దాక్కున్న నన్ను బయటకు రమ్మన్నారు. నా గదిలో వస్తువులను పగలగొట్టి నన్ను వదిలేశారు.
ఎక్కడున్నాడు లం...కొడుకూ... నీ.. అంటూ పెద్దవయస్సులో ఉన్న నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అప్పటికే అల్లరిమూకలు ఇంట్లో, మిద్దెపైన, చుట్టూ చేరి వస్తువులన్నీ పగలగొడుతున్నారు. శబ్దాలు వింటున్నాను. అడ్డుకోలేని వయస్సు నాది. అన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోయా. ఇంతటి అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదు. మేమూ నీలాగా వ్యవహరిస్తే నీ పరిస్థితి ఏమిటి?
భయం నా రక్తంలోనే లేదు
చెయ్యి బాగోలేక చెన్నైలో ఆస్పత్రికి వెళ్లా
ఇంతలోనే పారిపోయానంటూ చెప్పడం సిగ్గుచేటు
అరెస్టుచేసి జైల్లో పెట్టినా భయపడేదిలేదు
మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
నెల్లూరు రూరల్ : తమది నల్లపరెడ్ల కుటుంబమని.. తమ రక్తంలో భయమనేదే లేదని.. ఎమ్మెల్యే వేమిరెడ్డిని చూసి భయపడి పారిపోయానని చెప్పడం సిగ్గుచేటని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
నడమంత్రపు సిరితో అందలమెక్కిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన ఇంటిపై దాడికి పాల్పడిందెవరో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. అహంకారం తగదని, దీన్ని అణిచే రోజు దగ్గర్లోనే వస్తుందని చెప్పారు. తన చేయి బాగోలేక నొప్పిగా ఉంటే చెన్నైలోని ఆస్పత్రికి వెళ్లొచ్చేలోపే, ప్రసన్న పారిపోయాడని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
ఫిర్యాదు చేసినా కేసు నమోదేదీ..?
తన ఇంటిపై దాడిపై తాను ఫిర్యాదు చేసి నాలుగు రోజులవుతున్నా, ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందో అర్థమవుతోందన్నారు. తన కాళ్లు, చేతులు కట్టి ఈడ్చుకురావాలంటూ కొందర్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశించారని, తాను ఇంటి వద్దే ఉన్నానని, ఎవరైనా రావొచ్చని సవాల్ విసిరారు. వేమిరెడ్డి నేరుగా పోలీసులను తీసుకొచ్చి తనను అరెస్టుచేసి జైల్లో పెట్టినా భయపడేదిలేదని చెప్పారు.
ఇక తన ఇంటిపై దాడిచేసిన వారి పేర్లు తెలుసునని, ముఖ్యంగా నలుగురు దాడి చేయించారని ఆయన చెప్పారు. అన్ని వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులు విచారణను జరిపి, కారకులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. డబ్బు, అహంకారంతోనే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు.