పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ 

Municipalities Urban Development arrangements comprehensive survey - Sakshi

10 రోజుల్లో క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం 

సమర్థవంతంగా ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ అమలు 

సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్‌ అధికారులు నవంబర్‌ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు.

సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్‌ కార్యదర్శులు పాల్గొననున్నారు.

ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.  

వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన 
సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్‌ సిబ్బందికి మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు.

ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్‌తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్, ఆర్‌ఎస్‌ఆర్, టీఎస్‌ఆర్, కేఎంఎల్‌ ఫైల్స్‌ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top