AP: ఎన్నికల్లో కీలక శక్తిగా మహిళలు

Mukesh Kumar Meena Release Voter-List Female Voters Morethan Male Voters - Sakshi

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.99 కోట్ల మంది 

మహిళలు 2.02 కోట్లు.. పురుషులు 1.97 కోట్లు 

నాలుగు జిల్లాల్లో మాత్రం పురుష ఓటర్లే అధికం 

2022తో పోలిస్తే 7,51,411 తగ్గిన ఓటర్ల సంఖ్య 

రాష్ట్రవ్యాప్తంగా 45,951 పోలింగ్‌ స్టేషన్లు 

2023 ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా విడుదల 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తి­గా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలి­స్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఈ అంశా­న్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868.

వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్‌ జెండర్స్‌ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. మొత్తం 26 జిల్లాల్లో 22 జిల్లాల్లో పురుషులకంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,41,277 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,29,085 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,76,716 మంది ఓటర్లు ఉన్నారు. 

2022తో పోలిస్తే తగ్గిన ఓటర్ల సంఖ్య 
గతేడాది తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 7,51,411 తగ్గింది. 2022 తుది జాబితాలో 4,07,36,279గా ఉన్న ఓటర్ల సంఖ్య 2023 జాబితా నాటికి 3,99,84,868కి పరిమితమయింది. కానీ, నవంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితా సవరణ తర్వాత నికరంగా ఓటర్ల సంఖ్య 1,30,728 పెరిగినట్లు మీనా తెలిపా­రు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5,97,­701 మంది ఓటర్లు చేరితే 4,66,973 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అదనంగా ఒక పోలింగ్‌ స్టేషన్‌ పెరిగిందని తెలిపా­రు. రాష్ట్రంలో 45,951 పోలింగ్‌ స్టేషన్లు ఉ­న్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 721 మందికి ఓటు హక్కు ఉండగా, లింగ నిష్పత్తి 1,027గా ఉంది. 

పెరిగిన తొలి ఓటు హక్కు వినియోగదారులు 
2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చుకున్నారు. గత ఏడాది నవంబర్‌ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్లు ఉన్న తొలి ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య 78,438గా ఉంటే తుది జాబితా నాటికి ఈ సంఖ్య 3,03,225కు చేరినట్లు మీనా తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగుల సంఖ్య 5,17,403గా ఉంది. ఈ తుది ఓటర్ల జాబితాను అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, సవరణలను ఫారం–8 ద్వారా చేయవచ్చని తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top