
సాక్షి, వైఎస్సార్ కడప: సీబీఐ నోటీసులపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల షెడ్యూల్స్ ప్రకారం నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. విచారణకు అయిదు రోజుల సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తరువాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు.
గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనేమిటో, తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. న్యాయం గెలచి, నిజానిజాలు వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్నారు.
‘మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం బయటకు తేలాలని నేను కూడా భగవంతుడుని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించుకోవాలి.. ఇలాంటి నిరాధారమైన ఆరోణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
కాగా మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి స్పందించారు.
చదవండి: YSR Aarogyasri: 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు