స్టీల్‌ప్లాంట్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవం

MP Satyanarayana comments in Lok Sabha about Visakha Steelplant - Sakshi

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి

లోక్‌సభలో విశాఖ ఎంపీ సత్యనారాయణ

సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ పార్లమెంట్‌లో గళమెత్తారు. లోక్‌సభలో సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవమని చెప్పారు. ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ పేరిట అనేక ఏళ్ల పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాలతో 1982లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని గుర్తుచేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు 64 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఆభరణం వంటిదన్నారు. 35 వేల మంది ఉద్యోగుల, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు ఈ ప్లాంట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. దేశంలో ముడిసరుకు కోసం అధిక మొత్తం వెచ్చి స్తున్న స్టీల్‌ప్లాంట్‌గా, సొంతగనులు లేని ప్లాంట్‌గా ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top