కాలేయం ఇచ్చినా.. తప్పని గుండె కోత

Mother Donate Liver To Son, But He Lost Life In Machilipatnam - Sakshi

కుమారుడి కోసం కాలేయం దానం చేసిన మాతృమూర్తి

సీఎం సహాయనిధి కింద రూ. 25 లక్షలు సాయం

ఆపరేషన్‌ చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి యువకుడి మృతి

సాక్షి, మచిలీపట్నం: బిడ్డను బతికించుకోవాలనే తపనతో తన కాలేయాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన ఆ మాతృమూర్తికి గుండె కోత తప్పలేదు. పెళ్లైన పదిహేను ఏళ్ల తరువాత కలిగిన సంతానం కావడంతో ఎంతో అల్లారు ముద్దు చేసిన కుమారుడు ఇక లేడని తెలియడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తన కాలేయాన్ని అమర్చుకొని కొడుకు కళ్ల ముందుకొస్తాడని, అదే ఆసుపత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తల్లికి కన్న పేగు ఇక లేదని చెప్పే సాహసాన్ని అక్కడి వైద్యులు సైతం చేయలేని హృదయ విదారకరమైన పరిస్థితి.

వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం నగరం నోబుల్‌ కాలనీకి చెందిన గ్రేసీ, స్టీఫెన్‌ దంపతుల పెద్ద కుమారుడు ఇమ్మానియేల్‌ జాకబ్‌ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి కాలేయ సంబంధిత వ్యాధి ఉందని ఇటీవల వరకు తెలియదు. కొన్ని రోజుల క్రితం నోటి నుంచి రక్తం పడటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఇమ్మానియేల్‌ జాకబ్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కాలేయాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని, లేకుంటే ప్రాణాలు దక్కవని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఇమ్మానియేల్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. తండ్రి స్టీఫెన్‌ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు. ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉన్నందున వారి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మానవీయ కోణంలో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25 లక్షలు మంజూరు చేయించారు. కుమారుడికి తన కాలేయాన్ని ఇచ్చేందుకు తల్లి గ్రేసీ సిద్ధమైంది. (చదవండి: ఘోర ప్రమాదం: 23 మంది మృతి)

ఆపరేషన్‌ చేస్తుండగా.. 
కాలేయ మార్పిడికి ఆసుపత్రి వైద్యులు అంతా సిద్ధం చేసి తల్లి గ్రేసీకి ఆపరేషన్‌ ద్వారా కాలేయం కొద్ది భాగాన్ని తొలగించారు. దానిని ఇమ్మానియేల్‌కు అమర్చేందుకు ఆపరేషన్‌ చేస్తున్న క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతిచెందాడు. తల్లి గ్రేసీని ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచారు. కుమారుడు ఇమ్మానియేల్‌ మృతి చెందిన విషయం ఇంకా ఆమెకు తెలియదు. 50 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి బందరుకు వచ్చిన గ్రేసీ, స్టీఫెన్‌ దంపతులు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. గిటార్‌ ప్లే చేయడంలో అందవేసిన చేయి అయిన ఇమ్మానియేల్‌ ఎవాంజెలికల్‌ యూత్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన సంగీత ప్రతిభతో అందరి మనసును దోచుకునేవాడు. అటువంటి ఇమ్మానియేల్‌ ఇక లేడని తెలియడంతో నోబుల్‌ కాలనీలో విషాదం అలముకుంది. ఈ విషయాన్ని ఇమ్మీ స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని మచిలీపట్నానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top