
విశాఖపట్నం: పెద్ద చేప పడిందని సంబరపడిన మత్స్యకారుడికి ఊహించని పరిస్థితి ఎదురైంది. తన వలలో చిక్కింది చేప కాదు.. భారత నౌకాదళానికి చెందిన అత్యంత విలువైన పరికరం అని తెలిసి నివ్వెరపోయాడు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ఈ ‘టోఫిష్’ కోసం నేవీ అధికారులు గత 7 నెలలుగా గాలిస్తున్నారు.
ఏం జరిగిందంటే.?
విశాఖపట్నం తీరంలో ఇటీవల చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు.. తన వల బరువుగా మారడంతో భారీ చేప పడిందని ఆశపడ్డాడు. కష్టపడి వలను లాగి చూడగా, అందులో చేపకు బదులుగా ఓ వింతైన యంత్రం కనిపించింది. దాన్ని బయటకు తీసే ప్రయత్నంలో అతని వల పూర్తిగా చిరిగిపోయింది. ఆ పరికరం ఏమిటో అర్థంకాక, దాన్ని నేరుగా ఫిషరీస్ శాఖ జాయింట్ డైరెక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయనకు కూడా అది ఏ పరికరమో అంతుబట్టకపోవడంతో మంగళవారం వన్‌టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమాచారం అందుకున్న నేవీ అధికారులు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అది గతేడాది డిసెంబర్ 14న గల్లంతైన తమ ‘టోఫిష్’ అని, దాని కోసం అప్పటి నుంచి గాలిస్తున్నామని నేవీ అధికారులు ధ్రువీకరించారు. ఈ పరికరం సబ్‌మెరైన్లలో వాడే కీలకమైన సాధనమని, దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా.. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
అసలేంటీ ‘టోఫిష్’?
‘టోఫిష్’ అనేది పేరులో ఉన్నట్టు చేప కాదు. ఇది నీటి అడుగున పనిచేసే ఒక అత్యాధునిక సాంకేతిక వాహనం. సముద్ర గర్భాన్ని జల్లెడ పట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రపు అడుగుభాగం త్రీడీ మ్యాపింగ్, లోతు కొలతలు, సముద్ర గర్భంలోని వస్తువులను గుర్తించడం దీని ప్రాథమిక విధి.
ఇందులో సైడ్–స్కాన్ సోనార్, శబ్ద సెన్సార్లు, నీటి ఉష్ణోగ్రత, లవణీయత వంటి వివరాలను కొలిచే సెన్సార్లు అమర్చి ఉంటాయి. ఇది సముద్రంలో కోల్పోయిన వస్తువులు, విమానాలు లేదా ఓడల శిథిలాలను గుర్తిస్తుంది. శత్రు దేశాల సబ్‌మెరైన్లు, నీటి అడుగున అమర్చిన మైన్‌లను కనిపెడుతుంది. పైప్‌లైన్లు, కేబుల్స్ వేయడానికి సముద్ర గర్భం సురక్షితంగా ఉందో లేదో సర్వే చేస్తుంది. నీటి అడుగున ఉన్న ప్రమాదకరమైన కొండ చరియలు, ఇతర అడ్డంకులను గుర్తిస్తుందని నేవీ అధికారులు తెలిపారు.