ఊర్లు వదిలిపోవట్లే.. జనానికి సవాల్‌గా మారిన కోతులు

Monkeys Problem In Anakapalli District - Sakshi

బుచ్చెయ్యపేట: అనకాపల్లి జిల్లాలో కోతుల నిర్మూలనకు రెండు గ్రామాలను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామాల్లో కోతులను నిర్మూలించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ గ్రామాల్లో వేలాది కోతులు ఐదారేళ్లుగా తిష్ఠవేశాయి. అరటి, చెరకు, కొబ్బరి, మామిడి, వరి, తమలపాకు, కూరగాయలు, తదితర పంటలపై దాడి చేసి ఫలసాయాన్ని తింటూ పాడు చేస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఒక్కో రైతు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు.  

ఇళ్లలోకి చొరబడి... 
బుచ్చెయ్యపేట మండలం లోపూడి, బంగారుమెట్ట, ఎల్‌.బి.పురం, శింగవరం, పి.డి.పాలెం, చిన అప్పనపాలెం, భీమవరం, వడ్డాది, పాయకరావుపేట తదితర పరిసర గ్రామాల్లో కోతులు పంటలను పాడు చేయడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను పట్టుకుపోతున్నాయి. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. రోడ్లపై తిష్ఠ వేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీటిని నిర్మూలించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి, కలెక్టర్‌కు, వ్యవసాయ శాఖ మంత్రికి వందలాది మంది రైతులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోతులను అటవీ ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి ఆదేశాల మేరకు ముందుగా జిల్లాలో బంగారుమెట్ట, సత్యవరం గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అటవీ, వ్యవసాయ శాఖ అధికార్లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. వీటిని పట్టేవారిని తీసుకొచ్చి బోనుల ద్వారా అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు.  

ఆరేళ్లుగా కోతుల బెడద..  
మా గ్రామంలో రెండు వేల కోతులు సంచరిస్తున్నాయి. ఆరేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడులు పెట్టిన పంటలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఏడాదికి రూ. రెండు లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. 
– యెనుముల వాసు, రైతు సంఘం నాయకుడు, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట మండలం 

మిగిలిన గ్రామాల్లో కోతులను నిర్మూలించాలి 
రైతుల ఇబ్బందులను రైతు సంఘం నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కోతులు నిర్మూలనకు తొలుత బంగారుమెట్ట, సత్యవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అధికార్లు చర్యలు చేపట్టాలి. 
– చిక్కాల రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top