Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం'

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
చదవండి: ‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసలు మనుగడలోనే లేని సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటివారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఓ ప్రకటనలో తెలిపారు.