తెలంగాణలో ఎల్‌-నినోపై మంత్రి కీలక ప్రకటన | Minister Tummala Nageswara Rao holds meeting with officials on El Niño | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎల్‌-నినోపై మంత్రి కీలక ప్రకటన

Jul 23 2026 11:19 PM | Updated on Jul 23 2026 11:26 PM

Minister Tummala Nageswara Rao holds meeting with officials on El Niño
  • వచ్చే నెలల్లోనూ ఎల్-నినో ప్రభావం కొనసాగుతుంది.. రైతులు వరి సాగుపై పునరాలోచించాలి : మంత్రి తుమ్మల
  •  23 జిల్లాల్లో లోటు వర్షపాతం.. బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని రైతులకు సూచన
  •  విత్తనాలు, రుణాలు, డ్రిప్ పరికరాలు ముందుగానే సిద్ధం చేయాలని  ఆదేశం
  •  ఎల్-నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి తుమ్మల
  •  వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ కేటాయింపులు పెంచాలి: బ్యాంకులకు మంత్రి విజ్ఙప్తి

సాక్షి, హైదరాబాద్‌:  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఎల్-నినో కంటింజెన్సీ ప్రణాళికపై ఇంచార్జి మంత్రుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు (గురువారం) సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, రానున్న నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని, సెప్టెంబర్ నాటికి దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, డిసెంబర్ నాటికి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌పై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడంతో అక్కడి నుంచి గోదావరి, కృష్ణా నదులకు పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ఒకటి రెండు జిల్లాలు మినహా ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయాలని నిర్ణయించుకోవద్దని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయని, బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోయే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వ సామర్థ్యంపై మండలాల వారీగా రైతులకు నిరంతరం సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొంతమంది రైతులు ఇంకా వర్షాలు పడతాయనే ఆశతో వరి సాగు చేయాలని భావిస్తున్నారని, వారికి వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరించి ఎలాంటి నష్టాలు జరగకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో దాదాపు 23 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన విధంగానే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై కలెక్టర్లతో చర్చించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచించారు. ఈ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో రైతులందరికీ ఎల్-నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి లభ్యత, ప్రభుత్వ సూచనలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని ఆయా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి గారికి అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు,ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, కర్నాటి వరుణ్ రెడ్డి, భారత వాతావరణ శాఖ , ఇక్రిశాట్, క్రిడా, ఐఐఎంఆర్, ఎస్.ఎల్.బి.సి, నాబార్డు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ తదితర సంస్థల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement