తొలిసారి గెలిచి మంత్రి అయినా.. చివరి స్థానమే | Minister Savitha Ranked Last in Performance Review Amid Criticism Over Governance | Sakshi
Sakshi News home page

తొలిసారి గెలిచి మంత్రి అయినా.. చివరి స్థానమే

May 16 2026 1:10 PM | Updated on May 16 2026 2:05 PM

Minister Savitha Ranked Last in Performance Review Amid Criticism Over Governance

సవిత... తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్నారు. ఎలాగోలా గట్టెక్కారు. మహిళా కోటాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా స్వప్రయోజనాల కోసం తాపత్రయ పడుతూ అధ్వాన పనితీరుతో చివరి స్థానంలో నిలిచారు.  

సాక్షి, పుట్టపర్తి: సీఎం చంద్రబాబు ఇటీవలమంత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులకు సంబంధించి ప్రకటించిన పనితీరు జాబితాలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మంత్రి సవిత చివరన ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుండడంతోనే ఆమె చివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

విసుగెత్తిన సొంత పార్టీ కార్యకర్తలు.. 
సవిత వ్యవహారాలతో సొంత పార్టీ కార్యకర్తలే విసిగిపోయినట్లు తెలిసింది. ఇటీవల పార్టీ అధిష్టానం వద్ద టీడీపీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు అన్ని విషయాలను విన్నవించినట్లు తెలిసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా ఆమె అనుచరులు పెనుకొండలో రెచ్చిపోతున్నారని, వారిని నియంత్రించడంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని చెబుతున్నారు. సీనియర్‌ నాయకులను విస్మరించి మంత్రి అన్నీ తానై వ్యవహరిస్తుండటంపై పార్టీ నాయకుల్లో అసమ్మతి నెలకొంది.  

రొద్దం, పరిగిలో ఇసుక దందా.. 
మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని రొద్దం, పరిగి మండలాల్లో పెన్నా, జయమంగళి నదుల నుంచి రాత్రింబవళ్లు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. జేసీబీలతో తవ్వేసి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా కర్ణాటక తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులను నియంత్రిస్తుండటంతో ఇసుక దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక పొరుగు రాష్ట్రం చేరుతోంది. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకున్న అధికారులపై మంత్రి బదిలీ వేటు వేయించారు. దీంతో మిగతా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

పెనుకొండలో అన్నీ తామై.. 
నియోజకవర్గ కేంద్రంలో మంత్రితో పాటు అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల టెండర్ల నుంచి కియా కార్ల కంపెనీలో కాంట్రాక్టుల వరకు వాటా దక్కాల్సిందే. ప్రారంభోత్సవాల్లో రిబ్బన్‌ కటింగ్‌లకు కూడా పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడు పెనుకొండ వాసి అయినప్పటికీ ప్రొటోకాల్‌ పాటించకుండా ఆయన్ను పక్కకు నెట్టేస్తుండడం ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదమైంది. మంత్రికి తెలియకుండా ఎంపీ పార్థసారథి ఎలాంటి   కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదు. 

గోరంట్లలో భారీ భూ దోపిడీ.. 
కర్ణాటక శివారున ఉన్న గోరంట్ల మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కుని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల భూ కుంభకోణం వెలుగు చూసింది. ల్యాండ్‌ సీలింగ్‌ కింద పంచిన భూములపై మంత్రి అనుచరులు కన్నేసి పంజాబ్‌ కంపెనీకి కొంత రిజిస్ట్రేష‌న్‌ చేశారు. ఇంకొంత మంది రైతులు విక్రయించలేదని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. 

ప్రజల్లోనూ అసంతృప్తి.. 
మంత్రి అండతో పెనుకొండ నియోజకవర్గంలో ఆమె అనుచరులు చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. దందాలు, దోపిడీలు, కబ్జాలు జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో మంత్రి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.  

అధికారులపైనా ఒత్తిళ్లు.. 
మాట వినని అధికారులపై మంత్రి సవిత టక్కున వేటు వేయిస్తున్నారు. తాను చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయాలని పోలీసులపై పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోలేమని చెప్పిన ముగ్గురు ఎస్‌ఐలను ఇప్పటికే పంపించేశారు. మరో సీఐ పైన కూడా మంత్రి కక్ష కట్టినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన వారికి పనులు చేయలేదని ఓ తహసీల్దార్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన అందించిన పూల బొకేను అందరూ చూస్తుండగానే విసిరేయడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.   

Advertisement
 
Advertisement
Advertisement