
సాక్షి, అమరావతి: డీలర్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దాటవేత ధోరణిని అవలంభించారు. రేషన్ డిపోల్లో తొలిరోజు నుంచే పేదల వేలిముద్రలు తీసుకుని బియ్యం దొడ్డిదారిన తరలిస్తున్నారన్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. పైగా గతంలో బఫర్ గోడౌన్ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు.. అక్కడ నుంచి నేరుగా బియ్యం పంపిణీ వాహనాలకు (ఎండీయూలకు) సరఫరా జరిగేదని, తద్వారా బియ్యం ఎక్కడికి వెళ్లేవో లెక్కలు ఉండేవి కావని అవగాహన రాహిత్యంతో మాట్లాడారు.
సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకేసారి ఎక్కువ మంది దుకాణాలకు వస్తుంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పడం ద్వారా పంపిణీలో డొల్లతనాన్ని బయటపెట్టారు. మరోవైపు సమాచారం లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం డిపోలకు వస్తున్నట్టు అంగీకరించారు. 3.73 లక్షల మంది వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించామని చెప్పుకొచ్చారు. రేషన్ పంపిణీ తొలిరోజే చాలాచోట్ల బియ్యం అక్రమ రవాణా జరిగిందని మీడియా ప్రశ్నించగా.. భవిష్యత్‌లో ప్రతి బ్యాగ్‌కు క్యూఆర్ కోడ్, షాపుల్లో సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు. బియ్యానికి బదులు డీలర్లు డబ్బులిచ్చి పంపిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వే సమాధానమైంది. ఈ–పోస్ సమస్యలపై ప్రశ్నించగా కొన్నిచోట్ల సమస్య వచ్చి ఉండొచ్చన్నారు.
వైఎస్ జగన్ పర్యటనపై గాబరా
దళిత యువకులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ, బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెనాలి పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రి మనోహర్ గాబరా పడ్డారు. రేషన్ సేవలపై మీడియా సమావేశం పెట్టి వైఎస్ జగన్ పర్యటనపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు.