నటించడం మా సీఎంకు రాదు: కన్నబాబు

Minister Kannababu Speech In Assembly Session - Sakshi

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చ

సాక్షి, అమరావతి : రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అధికారంలోకి రాగానే రైతు పక్షపాతినని సీఎం జగన్‌ ప్రకటించారని గుర్తుచేశారు. రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు, పైపులు ఇస్తున్నామన్నారు. పంటల కొనుగోలుకు రూ.3,200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సహకార రంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలకుడు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. (ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే: సీఎం జగన్‌)

అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులు..
శాసనసభలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారు. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదు. వరదల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. డిసెంబర్‌ నెలాఖరుకల్లా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత మాది. సీఎం జగన్‌ స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. ఏరియల్‌ సర్వేలను గాలి సర్వేలని చంద్రబాబు, లోకేష్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసిన సర్వేలను ఏమనాలి. హుద్‌హుద్‌ తుపాను వస్తే అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులిచ్చారు. నటించడం మా ముఖ్యమంత్రికి రాదు.

రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌లోనే పరిహారం ఇవ్వాలనేది సీఎం జగన్‌ ఆదేశం. ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నాం. ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే చాలు ఉచిత పంటల బీమా వర్తింపు. రైతుల కోసం రాష్ట్రప్రభుత్వమే బీమా కంపెనీని ఏర్పాటు చేస్తుంది. కేంద్రం అనుమతి వచ్చిన వెంటనే బీమా కంపెనీని ఏర్పాటు చేస్తాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.11,981 కోట్లు వేశాం. ఏడాదిన్నరలో నేరుగా రైతుల ఖాతాల్లో రూ.13,463 కోట్లు వేశాం. పొగాకు రైతులనుసైతం ఆదుకునేందుకు పొగాకును కొనుగోలు చేశాం. సుమారు రూ.120 కోట్లతో పొగాకును కొనుగోలు చేశాం. రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.  చేయూత పథకం కింద మహిళలకు పాడి పశువులు అందిస్తున్నాం. సహకార చక్కెర కర్మాగారాలను చంద్రబాబు అమ్మేశారు. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం మేం సబ్‌కమిటీలను వేశాం కరోనా సమయంలో ధరలు పడిపోయిన అరటి, బత్తాయి పంటలను కొన్నాం. ధర పడిపోయిన ప్రతిసారి ఉల్లిని కొనుగోలు చేశాం’ అని వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top