వీర్లగుడిపాడుపై శాశ్వత బ్రిడ్జి నిర్మిస్తాం : మేకపాటి

Mekapati Gautam Reddy Visited Veerlagudipadu Effected By Nivar Cyclone - Sakshi

సాక్షి, నెల్లూరు : నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోయకవర్గం లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వరద ముంపు గ్రామాలలో పర్యటించారు. చేజార్ల ,సంగం ,అనంతసాగరం మండలాల్లో పలు గ్రామాలతో పాటు వీర్లగుడిపాడు గ్రామాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మేకపాటి తానే స్వయంగా పడవను నడుపుతూ గ్రామస్తులను పలకరించారు. నీట మునిగిన గ్రామాన్ని చూసిన మంత్రి మేకపాటి చలించిపోయారు. వీర్లగుడిపాడుకు బ్రిడ్జి ఎలా కడితే సమస్యకు శాశ్వత పరిష్కారం అంశమై పరిశీలించారు.

ఇక భవిష్యత్తులో ఎంత పెద్ద వరదలు వచ్చినా గ్రామస్తుల రాకపోకలకు అంతారయం కలగకుండా బ్రిడ్జి కట్టిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు భోజన సదుపాయాలు, ఇతర అత్యవసరాలపై అధికారులతో కలిసి చర్చించారు. వరద వస్తున్న నేపథ్యంలో ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆర్డీవోకు మంత్రి ఆదేశించారు. కాగా తాతల కాలం నుంచి వానలు, వరదలు మాకు మామూలే సారూ అంటూ గ్రామస్తులు మంత్రి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

అంతకు ముందు పెన్నా నది ప్రవాహాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదేనని పేర్కొన్నారు. డిసెంబర్ 25న ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు అప్పారావుపాలెం ప్రజలకు పట్టాలివ్వనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో పెన్నానదిపై 50 కి.మీ వద్ద సంగం ఆనకట్ట, 81 కి.మీ వద్ద నెల్లూరు ఆనకట్ట  అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాలను తాకుతూ పెన్నా ప్రవాహం కొనసాగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top