చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ విస్ఫోటనం | Massive Explosion at Challapalli Police Station | Sakshi
Sakshi News home page

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

Apr 1 2026 6:08 AM | Updated on Apr 1 2026 6:08 AM

Massive Explosion at Challapalli Police Station

పోలీస్‌ స్టేషన్‌లో దెబ్బతిన్న ఫర్నిచర్‌

మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేయడానికి సన్నద్ధమవుతుండగా ప్రమాదం 

పేలుడు ధాటికి ధ్వంసమైన పోలీస్‌స్టేషన్, ఫర్నిచర్, వాహనం 

ఎస్‌ఐతో సహా ఐదుగురికి గాయాలు 

ఐదు కిలోమీటర్ల మేర వినిపించిన పేలుడు శబ్దం, కమ్మేసిన పొగ

సమయం: ఉదయం 10.05 గంటలు, రోజు: మంగళవారం
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్టేషన్‌ సిబ్బంది విధుల్లో భాగంగా మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. స్టేషన్‌ రిసెప్షన్‌లో సిబ్బంది వారి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే విస్ఫోటనం సంభవించింది. ఏం జరిగిందని తేరుకొనేలోపే బాంబుల మోత మోగింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ పేలుడు శబ్దంతోపాటు దట్టంగా కమ్మేసిన పొగ ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించింది.దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

చల్లపల్లి: దీపావళి సందర్భంగా 2025 అక్టోబర్‌లో అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారుల నుంచి చల్లపల్లి పోలీసులు టపాసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ కేసు ఇటీవల కొట్టివేయడంతో కోర్టు ఆదేశాల ప్రకారం మందుగుండు సామగ్రిని నిరీ్వర్యం చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10.05 గంటల సమయంలో ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్‌ షేక్‌ అబ్దుల్లా, ఎస్‌ఐ వాహనం డ్రైవర్‌ డి.నాగరాజు మందుగుండును వాహనంలోకి ఎక్కించే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఉలిక్కిపడ్డ వారు ఏమి జరిగిందో తెలుసుకునేలోపే ఎస్‌ఐ దుర్గాంజనేయులు, కానిస్టేబుల్‌ షేక్‌ అబ్దుల్లా, డ్రైవర్‌ నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. రిసెప్షన్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ కె.శివపార్వతికి, హెడ్‌ కానిస్టేబుల్‌ కేటీడీవీ ప్రసాద్‌(తేజ)కు కూడా గాయాలయ్యాయి.  పేలుడు ధాటికి స్టేషన్‌ కిటికీలు, దర్వాజాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. పోలీస్‌జీపు దెబ్బతింది.

చొచ్చుకుపోయిన రాళ్ల పిక్కలు.. ధ్వంసమైన స్టేషన్‌ 
ముందుగుండు సామగ్రిలో ఉపయోగించిన చిన్న రాళ్లపిక్కలు శరీరం లోపలికి చొచ్చుకుపోవడంతో కానిస్టేబుళ్లు షేక్‌ అబ్దుల్లా, నాగరాజుల శరీరాలు రక్తపు ముద్దలా మారిపోయాయి. ఎస్‌ఐ దుర్గాంజనేయులుకు వెనుక భాగం, జుట్టు బాగా కాలిపోయాయి. తొలుత ఎస్‌ఐతోపాటు మిగిలిన వారిని చికిత్స నిమిత్తం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా, నాగరాజు, ఎస్‌ఐ దుర్గాంజనేయులు, కేటీడీవీ ప్రసాద్‌ వినికిడి శక్తి, కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. 

శభాష్‌ శివపార్వతి 
తనకు గాయాలైనా రక్తమోడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సహోద్యోగిని ఆస్పత్రికి తరలించేందుకు ఆమె చేయి అందించింది. స్టేషన్‌లో సంభవించిన బాణసంచా ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్‌ కె.శివపార్వతి గాయాలయ్యాయి. అయినా పట్టించుకోకుండా తీవ్రగాయాలతో నేలకొరుగుతున్న అబ్దుల్లాను వాహనం ఎక్కించింది. తర్వాత ఆమె కూడా చల్లపల్లి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీంతో శివపార్వతికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

అట్టపెట్టెలో నుంచి జారి పడడంతో పేలుడు 
మందుగుండు సామగ్రి వాహనంలోకి ఎక్కించే సమయంలో అట్టపెట్టె అడుగు భాగం నుంచి మందుగుండు జారి కింద పడడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. సీసీఫుటేజీలో ఈ విషయం వెల్లడైందన్నారు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి ఎస్‌ఐ డి. దుర్గ ఆంజనేయులుతోపాటు కానిస్టేబుల్‌ అబ్దుల్లా, డ్రైవర్‌ నాగరాజును మంత్రులు వాసంశెట్టి సుభా‹Ù, కొల్లు రవీంద్ర, ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తదితరులు పరామర్శించారు.

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. కోర్టుకానిస్టేబుల్‌ అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement