AP Crime: అతను వీఆర్‌ఓ.. ఆమె సచివాలయ ఉద్యోగి.. ఇద్దరూ దారి తప్పారు..

Married Man Living Relation With Married Woman in Puttaparthi - Sakshi

దారితప్పిన భర్త రామ్మోహన్‌ 

మరో వివాహితతో సహజీవనం 

భర్తతోనే ఉండేందుకు ఇద్దరు పిల్లలతో పోరాటం 

అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం 

వారిద్దరూ వివాహితులే. ఇద్దరికీ కుటుంబాలున్నాయి. అతను వీఆర్‌ఓగా పనిచేస్తుండగా...ఆమె సచివాలయ ఉద్యోగి. కానీ ఇద్దరూ ప్రేమ పేరుతో దారితప్పారు. సహజీవనం చేస్తూ... రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టారు. సహచరులను, సంతానాన్ని శోకంలో ముంచారు. అనైతికమని తెలిసీ అదే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఫలితంగా సచివాలయ ఉద్యోగికి తాళికట్టిన భర్త... వీఆర్‌ఓతో జీవితం పంచుకున్న భార్య మమత జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి.  

సాక్షి, పుట్టపర్తి: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు పుట్టాక... మరో వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. అడ్డుతప్పించుకునేందుకు భార్యను వేధిస్తున్నాడు. అయినప్పటికీ తన భర్తతోనే కలిసి ఉండేలా చూడాలంటూ ఆ మహిళ పోలీసులను, అధికారులను వేడుకుంటోంది. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది.  

ప్రేమ పెళ్లి...పిల్లలు పుట్టాక లొల్లి.. 
కొత్తచెరువు మండలం కొడపగానపల్లికి చెందిన ఒంటికొండ రామ్మోహన్‌ వీఆర్‌ఓగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత గ్రామానికే చెందిన మమతను ప్రేమించి 2015 ఫిబ్రవరి 13న బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి యస్మిత, యక్షిత సంతానం. వీరి సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో రామ్మోహన్‌ దారి తప్పాడు.  2021 సెప్టెంబరు నుంచి భార్యకు దూరంగా ఉంటున్నారు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న మరో వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.

చదవండి: (వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి..)

ఆ మహిళ భర్త సంబంధీకులు గొడవకు దిగినా... రామ్మోహన్‌ తీరులో మార్పు రాలేదు. పైగాతన భార్య, పిల్లలను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విడాకులకు అంగీకరించాలని భార్య మమతపై ఒత్తిడి తేగా, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఆ తర్వాత ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో 2022 మార్చి 2న కొత్త చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు.. ఆమెకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయారు. కనీసం రామ్మోహన్‌ను స్టేషన్‌కు కూడా పిలిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 11న మమత మరోసారి ‘స్పందన’లో  తన గోడు వెళ్లబోసుకుని న్యాయం కోసం ఎదురుచూస్తోంది. 

నా భర్త దగ్గరకు చేర్చండి 
నా ఇద్దరు పిల్లలు అనాథలుగా మారరాదు. మాకు బతుకు తెరువు కావాలి. నా భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చి అతని దగ్గరకు చేర్చండి. నా భర్తతో సహజీవనం చేస్తున్న వివాహిత భర్తకూ న్యాయం చేయండి. ఆ ఇద్దరి సంతోషం కోసం రెండు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు పోలీసు స్టేషన్లు, కలెక్టర్‌ కార్యాలయాలు తిరిగాను. ఎవరూ న్యాయం చేయలేదు. నాకు విడాకులు అవసరం లేదు. నా భర్తతో కలిసి జీవించాలని ఉంది. – మమత  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top