ఐదింటిపై పట్టు

Many issues related division between Telugu states have not been resolved - Sakshi

తెలంగాణ నుంచి విద్యుత్, ధాన్యం బకాయిలు, ఈక్విటీ, పన్నుల కోసం ఏపీ డిమాండ్‌

నేడు కేంద్ర హోంశాఖ సారథ్యంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీ

విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా అపరిష్కృతంగానే విభజన సమస్యలు

సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఎనిమిదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పలు సమస్యలు పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అడపాదడపా ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వహించడం మినహా పరిష్కార మార్గాలను సూచించలేదు. తాజాగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్‌ కుమార్‌  నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్‌లు ఎస్‌ఎస్‌ రావత్, రామకృష్ణారావులతో ఏర్పాటైన ఉప కమిటీ గురువారం ఉదయం 11 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి దీనికి హాజరు కానున్నారు. విభజనకు సంబంధించి ఐదు పెండింగ్‌ అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు.

గాజుల రామారంలో 270 ఎకరాలు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) ఆస్తుల విభజనపై తొలుత అంగీకరించిన తెలంగాణ సర్కారు ఆ తరువాత మాట మార్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి 2005–06లో ప్రభుత్వ ఈక్విటీ కింద డబ్బులకు బదులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఎకరం రూ.40 లక్షల చొప్పున 270 ఎకరాలను కేటాయించింది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలి. తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో ఏపీకి వాటా ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉప కమిటీ సమావేశంలో ప్రస్తావించనుంది.

కరెంట్‌ బకాయిలు ఏవి?
రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను  తెలంగాణ చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా అంగీకరించినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు కాకపోవడంతో ఏపీ విద్యుత్‌ సంస్థలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌ విద్యుత్తు బిల్లులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉప కమిటీ సమావేశంలో కోరనుంది.

హైదరాబాద్‌లో పన్నుల చెల్లింపులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది.

మా వాటా మాటేమిటి?
కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ఏపీ నిధులతో ధాన్యం సేకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌర సరఫరాల సంస్థలకు ఒకే అధికారి పని చేశారు. ఈ సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం ఏపీకి చెందిన రూ.400 కోట్లను వినియోగించారు. ఆ మొత్తాన్ని తెలంగాణ నుంచి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. అదే సమయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీ కూడా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్‌ కుమార్‌ దృష్టికి తేనుంది.

అజెండాలో ఐదు ప్రధానాంశాలు
1. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన
2. ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన విద్యుత్‌బకాయిలు
3. పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం
4. బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్ల పంపిణీ
5. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు అంశం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top