‘మాన్సాస్‌’లో మరో మాయ

Mansas Lands scam with Resolutions of TDP Leaders - Sakshi

టీడీపీ నేతల తీర్మానాలతో మాన్సాస్‌ భూముల హాంఫట్‌ 

విజయనగరంలో 145.78 ఎకరాలు మాయం 

పాత రికార్డుల పరిశీలనతో వెలుగులోకి మరో కుంభకోణం 

2016 ఏప్రిల్‌లో మాన్సాస్‌ ట్రస్టు భూములని అధికారుల నివేదిక 

ఏడాదికే అవి మాన్సాస్‌ భూములు కాదంటూ ఎన్‌వోసీ జారీ 

చంద్రబాబు ఆశీస్సులతో చక్రం తిప్పిన అశోక్‌గజపతిరాజు, టీడీపీ నేత కుటుంబరావు

సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉంచేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తున్న రోజులవి. 2016 ఏప్రిల్‌ 11వ తేదీ.. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలోని ధర్మపురి రెవెన్యూ గ్రామ పరిధిలో గల 474.44 ఎకరాల భూములు మాన్సాస్‌ ట్రస్టుకు చెందనవిగా పేర్కొంటూ అప్పటి ట్రస్టు ఈవో ఆ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా అసిస్టెంట్‌ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ ద్వారా ఆ భూములకు ఎటువంటి ప్రైవేట్‌ రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చాలంటూ లేఖ రాశారు.

ఇది జరిగిన ఏడాదికే.. 2017 ఏప్రిల్‌ 19వ తేదీన ధర్మపురి రెవెన్యూ గ్రామంలో మాన్సాస్‌ ట్రస్టు భూములుగా నిర్ధారించిన 474.44 ఎకరాల భూములలో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదంటూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ లేఖ రాశారు. అవి ట్రస్టు భూములని పేర్కొన్నప్పుడు, అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తిరిగి లేఖ రాసినప్పుడు దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నది ఒక్కరే. మొత్తంగా ఏదో మాయ చేసినట్టుగా.. ట్రస్టు ఆస్తుల జాబితా నుంచి బాగా ఖరీదైన 145.78 ఎకరాల భూములు ఎగిరిపోయాయి. మాన్సాస్‌ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 14,418 ఎకరాల భూములుండగా.. 2015–16, 2018–19లలో 150 ఎకరాలను మెడికల్‌ కళాశాల–ఆస్పత్రి పేరుతో విక్రయించేసిన బాగోతం ఇప్పటికే వెలుగు చూసిన విషయం తెలిసిందే.

విజయనగరం జిల్లా కొత్తవలస, చిప్పాడ, బాకురపాలెం, డాబా గార్డెన్స్, సంతపేటలో ఉడా ద్వారా ఆ 150 ఎకరాలను విక్రయించగా రూ.120 కోట్లు వచ్చిందని ట్రస్టు లెక్క చూపించింది.  సింహచలం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, మాన్సాస్‌ ట్రస్టు భూములకు సంబంధించి టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు పాత రికార్డులు పరిశీలన చేయగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చట్టాలను, కోర్టు ఉత్తర్వులను, దేవదాయ శాఖ నిబంధనలను తోసిరాజని అధికారం దన్నుతో ఈ కుంభకోణానికి తెరలేపినట్టు రికార్డుల పరిశీలనలో తేలింది. 

ఆ కమిటీ తీర్మానం ప్రకారమే.. 
అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు 2017 ఫిబ్రవరిలో ధర్మపురి రెవెన్యూ పరిధిలో ట్రస్టు పేరిట ఉండే 145.78 ఎకరాలు ట్రస్టువి కావంటూ ట్రస్టు ఈవో అప్పటి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం, ఆ వెనువెంటనే ఆ భూములకు రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ నిరభ్యంతర సర్టిఫికెట్‌ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. 

ట్రస్టు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాకే.. 
2014 జూన్‌–2019 మే మధ్య రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఈ భూ మాయ చోటుచేసుకోవడం విశేషం. అంతకుముందు మాన్సాస్‌ ట్రస్టు చైర్మనుగా ఉన్న ఆనంద గజపతిరాజు 2016 మార్చిలో మరణించారు. దీంతో టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజును ట్రస్టు చైర్మనుగా నియమిస్తూ 2016 ఏప్రిల్‌ 7న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కుటుంబరావును ట్రస్టు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ అదే 2016 ఏప్రిల్‌ 7వ తేదీన ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పట్లో ట్రస్టు నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలే ఉన్నారు. వీరి నియామకం జరిగిన రోజుల్లోనే దేవదాయ శాఖ అధికారులు విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో ట్రస్టు పేరిట 474.44 ఎకరాలుందని నిర్ధారించారు. ఏడాదికల్లా అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తేల్చడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top