నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు | Man sentenced to life imprisonment for murder in Nandyal district | Sakshi
Sakshi News home page

నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు

Mar 31 2026 4:18 AM | Updated on Mar 31 2026 4:18 AM

Man sentenced to life imprisonment for murder in Nandyal district

శిక్ష పడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు

నంద్యాల మూడో అదనపు న్యాయస్థానం సంచలన తీర్పు

2012లో వైఎస్సార్‌సీపీ నేత ఇంజేటి క్రిష్ణారెడ్డి, ఆయన భార్య, కుమారుడు, అనుచరుడి హత్య  

19 మందిపై హత్యానేరం నమోదు  

ఇప్పటికే చనిపోయిన ఏడుగురు నిందితులు  

నేరం రుజువు కావడంతో 12 మంది దోషులకు శిక్ష  

శిక్షపడినవారంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 14 ఏళ్ల కిందట జరిగిన నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు విధిస్తూ నంద్యాల మూడో అదనపు న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు ఇంజేటి క్రిష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జునరెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు (దుబ్బె)లను హత్యచేసిన ఈ కేసులో 19 మందిపై హత్యానేరం నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే ఏడుగురు మరణించారు. నేరం రుజువు కావడంతో మిగిలిన 12 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పుచెప్పారు.

దోషులంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అనుచరులే. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 2012 ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు ఇంజేటి క్రిష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి ఇంట్లో ఉండగా.. నిందితులు జీపులో వచ్చి గేటును బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. క్రిష్ణారెడ్డిపై కారంపొడి చల్లి కత్తులతో దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్య గోవిందమ్మ, కొడుకు మల్లికార్జునరెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు (దుబ్బె)లను అతి కిరాతకంగా నరికి చంపేశారు.

ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి 19 మందిపై చార్జిషిటు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు నాగిరెడ్డి (ఏ1) హత్యకు గురికాగా, ఇంజేటి వెంకట్రామిరెడ్డి (ఏ3), క్రిష్టిపాడు పెద్దదస్తగిరిరెడ్డి (ఏ5), గొల్ల శేషు (ఏ6), కుందూరు వెంకట్రామిరెడ్డి (ఏ7), మాల పెద్దన్న (ఏ17), కొప్పు తిరుపాలు (ఏ19) కేసు విచారణ జరుగుతుండగానే మరణించారు. మిగిలిన 12 మందిపై తుది విచారణ సాగగా హత్యానేరం రుజువైంది. దీంతో 12 మందికి జీవితఖైదు పడింది.  

అఖిలప్రియ అనుచరులు వీరే..  
ఇంజేటి శివకుమార్‌రెడ్డి (ఏ2), కుందూరు రామిరెడ్డి (ఏ4), బాస్సాగారి హుస్సేన్‌ వలి (ఏ8), కమ్ముబాయిగారి కమల్‌ (ఏ9), కమ్ముబాయిగారి మహబూబ్‌ బాషా (ఏ10), కమ్ముబాయిగారి బాబు బాషా (ఏ11), కమ్ముబాయిగారి చిన్న మాబు (ఏ12), పక్కీర్‌ వలి (ఏ13), ఉయ్యలవాడ చాంద్‌బాషా (ఏ14), మాగిగ పెద్ద అంకాలు (ఏ15), మాల సూరబోయిన తిరుపాలు (ఏ16), మాల లక్కు శ్రీను (ఏ18).

దోషులకు టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ  
నలుగురిని దారుణంగా హత్యచేసిన నేరానికి 12 మందికి జీవితఖైదు విధించారని తెలియడంతో ఒక్క­సారిగా నంద్యాల కోర్టు ఆవరణలో దోషుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు వినిపించాయి. హత్య­కేసులో 12 మందికి శిక్షపడిన విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ టీగీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోర్టు ఆవ­రణకు చేరుకుని దోషుల్ని పరామర్శించారు. జీవితఖైదు పడినవారిని పోలీసులు కడప జైలుకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement