యూట్యూబ్‌ చూసి దొంగనోట్లు తయారీ.. చికెన్‌ పకోడి పట్టిచ్చింది | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ చూసి దొంగనోట్లు తయారీ.. చికెన్‌ పకోడి పట్టిచ్చింది

Published Tue, Sep 28 2021 8:23 AM

Man Arrested For Fake Money Printing Guntakal - Sakshi

సాక్షి,గుంతకల్లు( అనంతపురం): యూట్యూబ్‌లో చూసి గుంతకల్లు కేంద్రంగా దొంగ నోట్లు తయారు చేసి అక్రమంగా చలా మణి చేసిన ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్‌బాషా.. పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లిన అతను.. చికెన్‌ పకోడి కొనుగోలు చేసి రూ.వంద నోటు ఇచ్చాడు.

పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబులు అప్రమత్తమై నూర్‌బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ.వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది. దీంతో నూర్‌బాషాను అదుపులోకి తీసుకుని జొన్నగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో దొంగనోట్ల తయారీ గుట్టు రట్టయింది. యూట్యూబ్‌ ద్వారా నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లను తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు. రూ.50 వేల అసలైన నోట్లు తీసుకుని రూ.లక్ష నకిలీ నోట్లను అందజేయడంతో పాటు స్వయంగా తాము కూడా  మార్కెట్‌లో చలామణి చేసినట్లు తెలిపాడు.  

ప్రింటర్, జిరాక్స్‌ మిషన్లు స్వాధీనం 
శనివారం రాత్రి నిందితుడు నూర్‌బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి జొన్నగిరి పోలీసులు చేరుకున్నారు. అతని ఇంటిలో దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్‌ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో నూర్‌బాషాకు సహకరించిన ఖాజా, ఎన్‌.ఖాసీంను అరెస్ట్‌ చేసి సోమవారం కర్నూలు జిల్లా కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపారు.

చదవండి: దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. 

Advertisement
Advertisement