దుర్గ గుడిలో భక్తులు అల్లాడిపోతున్నారు: మల్లాది విష్ణు | Malladi Vishnu on durga gudi issue | Sakshi
Sakshi News home page

దుర్గ గుడిలో భక్తులు అల్లాడిపోతున్నారు: మల్లాది విష్ణు

Oct 11 2026 4:02 PM | Updated on Oct 11 2026 4:41 PM

Malladi Vishnu on durga gudi issue

తాడేపల్లి: దుర్గ గుడిలో సరైన సౌకర్యాలు లేక భక్తులు అల్లాడిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో సరైన ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. భక్తులు క్యూలలో ఆహారం, నీరు లేక అల్లాడిపోతున్నారని చెప్పారు.

తాడేపల్లిలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఒక గంటలో వారి సమస్యలు పరిష్కరించాలి. కొండమీదకు మీడియాను అనుమతించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మీడియాను నిరాకరించి ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రాధాన్యం ఇవ్వటమేంటి? భక్తులకు మంచినీళ్లు లేవు.. ప్రచారానికి మాత్రం నిధులున్నాయా? అమ్మవారి సన్నిధిలో భక్తులకు సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం.. విజయవాడ ఉత్సవాల పేరుతో ఆర్భాటాలు ఎందుకు?

ప్రభుత్వ ప్రచారానికి ఎక్కడా లేని ప్రాధాన్యం ఇ‍స్తున్నారు. భక్తులకు మంచినీళ్లు కూడా ఇవ్వటం లేదు. కానీ వేడివేడి పాలు, బిస్కెట్లు ఇస్తామంటూ గొప్పలు చెప్పుకుంటారా? గంటల తరబడి క్యూలైన్లలో భక్తులను అవస్థలు పెట్టటమేనా చంద్రబాబు చెప్పే సుపరిపాలన? క్యూలైన్లలో చిన్నారులకు, మహిళలకు గాయాలవుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడమే పెద్ద బాధ్యత. దానికి అదనంగా కార్యక్రమాలు పెట్టి అధికార యంత్రాంగంపై భారం మోపడం ఎందుకు?

భక్తుల సేవలో ఉండాల్సిన అధికారులు.. వీఐపీల సేవలో మునిగిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? వీఐపీల వాహనాలకు అడ్డూ అదుపూ లేదు. సామాన్య భక్తులకు మాత్రం అడుగడుగునా అడ్డంకులా? అధికారుల మధ్య సమన్వయం లేకపోతే.. ఆ మూల్యాన్ని సామాన్య భక్తులు ఎందుకు చెల్లించాలి? ఎంపీకి, కలెక్టర్‌కు మధ్య సమన్వయం లేకపోవడంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.

అధికారులు విభేదాలను పక్కనపెట్టాలి
అధికారుల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే వాటిని పక్కనపెట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మల్లాది విష్ణు సూచించారు. ‘‘నవరాత్రుల ఏర్పాట్లలో లోపాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే మీడియానే ఇబ్బందులకు గురిచేస్తారా? దేశవిదేశాల్లోని భక్తులకు అమ్మవారి దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే మీడియా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వరా? రిపోర్టర్లకు పాసులు లేవు.. కెమెరామెన్లకు అనుమతులు లేవు.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాత్రం పెద్దపీట వేస్తారా?

ప్రజల సమస్యలను చూపించే మీడియా వద్దా? ప్రభుత్వ ప్రచారం చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లే కావాలా? మీడియా ప్రతినిధులు రోడ్డెక్కి నిరసనలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీడియా పాసుల విషయంలో ఇంత గందరగోళం సృష్టించిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాలి. ఇన్‌ఫ్లుయెన్సర్లకు అనుమతులు ఇస్తూ, మీడియా ప్రతినిధులను నిరోధించడంలో ఆంతర్యమేంటి? ఇన్‌ఫ్లుయెన్సర్లకు దేవస్థానం నిధుల నుంచి డబ్బులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలపై లెక్కలు బయటపెట్టాలి.

భక్తుల కానుకలు భక్తుల సౌకర్యాల కోసమా? ప్రభుత్వ ప్రచారం కోసమా? ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఎంతమందికి అనుమతులిచ్చారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ వివరాలు వెల్లడించాలి. భక్తుల ఇబ్బందులను మీడియా చూపిస్తే ప్రభుత్వ పరువు పోతుందనే భయమా? గతంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు మంత్రుల పర్యవేక్షణ ఎక్కడ?

అధికారుల మధ్య సమన్వయం ఎక్కడ? భక్తులకు భరోసా ఎక్కడ? విజయవాడ ఉత్సవాల పేరుతో వ్యాపారులపై భారం మోపుతున్నారు. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది? దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మీడియా ప్రతినిధుల పాసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి.. లేకుంటే వైయస్సార్‌సీపీ వారి ఆందోళనకు అండగా నిలుస్తుంది. అమ్మవారి సన్నిధిలో కావాల్సింది ఆర్భాటం కాదు.. భక్తులకు సౌకర్యాలు, అధికారుల సమన్వయం. ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యం భక్తుల భద్రతకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement