చైనాకు 'చెక్'‌ లక్ష్యంగా..

Malabar 2020 Exercise Was Started - Sakshi

మలబార్‌ విన్యాసాలు ప్రారంభం

ఇండో పసిఫిక్‌ రీజియన్‌పై పట్టు బిగిస్తున్న భారత్‌

సత్తా చాటిన యాంటీ సబ్‌ మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలు

తొలిసారిగా పాల్గొన్న రాయల్‌ ఆస్ట్రేలియా

కోవిడ్‌–19 నేపథ్యంలో నాన్‌–కాంటాక్ట్‌ ఎట్‌ సీ పద్ధతిలో విన్యాసాలు

ఈ నెల 6 వరకూ తొలి దశ యుద్ధ విన్యాసాలు

సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్‌ రీజియన్‌పై పట్టు సాధిస్తూ.. శత్రు దేశం చైనా కుటిల యత్నాలకు, దాని దూకుడుకు చెక్‌ చెప్పేందుకు భారత్‌ వేస్తున్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. రెండున్నర దశాబ్దాలుగా భారత్, యూఎస్, జపాన్‌ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మలబార్‌ యుద్ధ విన్యాసాల్లో ఈసారి రాయల్‌ ఆస్ట్రేలియా నౌకాదళం జత కలిసింది. మంగళవారం ప్రారంభమైన 24వ మలబార్‌ విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకూ తొలి దశ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఆ తరువాత ఇదే నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మలబార్‌ రెండో దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నట్టు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.

భారత నౌకాదళంతో పాటు యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ (యూఎస్‌ఎన్‌), జపాన్‌ మేరీటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (జెఎంఎస్‌డీఎఫ్‌)తోపాటు తొలిసారిగా రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ (ఆర్‌ఏఎన్‌) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్‌–19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్‌ కాంటాక్ట్‌–ఎట్‌ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. ఇండో–పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నావిగేషన్‌ వ్యవస్థల్ని పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలకు చెక్‌ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి జత కట్టినట్టు ఆయా దేశాల నౌకాదళ వర్గాలు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎన్‌ఎస్‌ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్‌ శివాలిక్, ఐఎన్‌ఎస్‌ శక్తి, ఐఎన్‌ఎస్‌ సుకన్యతో పాటు సింధురాజ్‌ సబ్‌మెరైన్లు భారత్‌ తరఫున విన్యాసాల్లో పాల్గొన్నాయి.

యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీకి చెందిన యూఎస్‌ఎస్‌ జాన్‌ మెక్‌కైన్, హెచ్‌ఎంఎఎస్‌ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్‌ ఒనామీతో పాటు రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి. యాంటీ సబ్‌ మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలతో సత్తా చాటాయి. నాలుగు దేశాల యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ.. విన్యాసాలకు తెర తీశాయి. భారత్‌–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992 నుంచి మలబార్‌ విన్యాసాలు ప్రారంభించాయి. 2015లో జపాన్‌ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 4 వరకూ జపాన్‌ తీరంలో మలబార్‌ విన్యాసాలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top