అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు! | Sakshi
Sakshi News home page

అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!

Published Thu, May 30 2024 1:44 PM

Madhav Shingaraju Comments On Buddha Venkanna's Words That Nara Lokesh should Become Chief Minister

ఇప్పుడు అంతే కాబోతోందా?!

లోకేశ్‌ను ‘పెద్దన్న’ను చేయాలని ‘బుద్ధన్న’ డిమాండ్‌!!

తెలుగుదేశం పార్టీలో అసలేం జరుగుతోంది?

పొత్తులే చంద్రబాబు ప్రాణం

ఫలితాలంటే మాత్రం భయం!

ఆయన మీద ఆయనకే నమ్మకం లేదా?

పార్టీ పని అయిపోయినట్లేనా?

జెండా పీకేసే పరిస్థితి రాబోతోందా?!

‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్‌ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్‌ చేయాలి. ఇది మా డిమాండ్‌.’’

ఈ డిమాండ్‌ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్‌ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్‌ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?

లోకేశ్‌ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్‌. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్‌ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్‌.

టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్‌ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్‌ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!

ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.

చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో సైకిల్‌ కొట్టుకుపోయింది. స్కూల్‌ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.

ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్‌ చార్జీలు, నీటి చార్జీల పెంపు.  దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్‌ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్‌ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.

ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్‌ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్‌ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్‌ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.

కార్గిల్‌ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్‌ ప్రభావం.

2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.

‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్‌పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం.  దాంతో యాంటీ కాంగ్రెస్‌ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్‌ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్‌ ఓటు చిరంజీవి, జయప్రకాష్‌ నారాయణ్‌ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్‌ పార్టీ యొక్క ఓట్‌ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్‌ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్‌ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్‌ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్‌. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.

2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.

2019 గురించి ఇక చెప్పేదేముంది?  వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్‌ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్‌ కల్యాణ్‌ హీరో ఫ్యాక్టర్‌ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్‌.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్‌ మ్యాన్‌ షో’ పార్టీని ఒంటరిని చేసింది.

ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్‌ శింగరాజు

Advertisement
 
Advertisement
 
Advertisement