మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో మెరుగైన విద్యుత్‌ ఉత్పత్తి

Machkund Hydro Power Plant: All Generators Utilized Produces 120 MW of Electricity - Sakshi

జనరేటర్లన్నీ పూర్తిస్థాయిలో వినియోగం

పూర్తిస్థాయిలో అభివృద్ధికి రూ.500 కోట్లు వెచ్చించిన ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు 

ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు..ఆకట్టుకునే జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య పురుడుపోసుకున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ఎన్నో ఏళ్ల తరువాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఈ కేంద్రంలో జనరేటర్లన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు రూ.500 కోట్లు వెచ్చించాయి. 

ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఇక్కడ ఆరు జనరేటర్లు సేవలందిస్తున్నాయి. 1, 2, 3 జనరేటర్లతో 51, 4,5,6 జనరేటర్లతో 69 చొప్పున 120 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. సుమారు 65 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఈ విద్యుత్‌ కేంద్రంలో పురాతన యంత్రాలు కావడంతో గత పదేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. తరచూ సాంకేతిక సమస్యలతో అధికారులు, సిబ్బంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు. షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్‌ కేంద్రంపై దృష్టి సారించి, శత శాతం విద్యుత్‌ ఉత్పత్తిని చేయగలిగారు. నాగార్జున సాగర్, సీలేరు వంటి పలు విద్యుత్‌ కేంద్రాలు కేవలం పీక్‌లోడ్‌ అవర్స్‌లో మాత్రమే ఉత్పాదన చేస్తుండగా మాచ్‌ఖండ్‌ మాత్రం ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్‌ కేంద్రంలో ఆరు జనరేటర్లతో 120 మోగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 

డుడుమ, జోలాపుట్టు ప్రధాన ఆధారం 
మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంంద్రంలో ఉత్పత్తికి నీరందించేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలశయాలు ప్రధాన ఆధారం. డుడుమ నీటి సామర్థ్యం 2590, జోలాపుట్టు నీటి సామర్థ్యం 2750 అడుగులు. వీటికి మత్స్యగెడ్డ నీరే దిక్కు. జి. మాడుగుల మండలం గెమ్మెలి నుంచి మొదలై మత్స్యగుండం మీదుగా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈ గెడ్డ విస్తరించింది. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా రెండు జలశయాల్లో నిల్వ చేస్తారు. డుడుమ కెనాల్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తుంటారు. విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం విడుదల అయినా నీరు తొలుత అప్పర్‌ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. అక్కడ నుంచి ఆంధ్ర భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్‌ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసిన తరువాత మిగతా నీరు గోదావరిలో కలుస్తోంది 

రూ.500 కోట్లతో ఆధునికీకరణ.. 
120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్‌ కేంద్రంలో కాలం చెల్లిన జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరమ్మతుల పేరిట ఏటా రూ. కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రతీ జలవిద్యుత్‌ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు మాత్రమే పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు పైబడినా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలు మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆధునికీకరణకు నిర్ణయించాయి. ఇందుకు రూ. 500 కోట్లు కేటాయించాయి. విద్యుత్‌ కేంద్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక తయారీ బాధ్యత టాటా ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీకు ఏపీజెన్‌కో వర్గాలు అప్పగించాయి. దీంతో అదే సంస్థకు చెందిన 14 మందితో కూడిన బృందం గత ఏడాది డిశంబర్‌ నెలలో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌యార్డులు, భవనాల స్థితిగతులను పరిశీలించింది. వాటికి ఆయువు (ఎనాలసిస్‌) పరీక్షలు నిర్వహించింది. దీనిపై నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కన్సల్టెన్సీ బృందం అందజేసింది. 

పూర్తిస్థాయిలో ఉత్పాదన శుభపరిణామం 
విద్యుత్‌ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం పనితీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తరువాత పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పాదన జరగడం శుభపరిణామం. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్‌ కేంద్రాల విద్యుత్‌ ఉత్పత్తితో పోలిస్తే మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ ఉత్పత్తి తక్కువే అయినా వాటికి ధీటుగా ఉత్పాదకత ఉంటుంది. ఆధునికీకరణ కోసం ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఈ పనులు పూర్తయితే మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి ఎంతో మేలు జరుగుతుంది. 
– కేవీ నాగేశ్వరరావు, సీనియర్‌ ఇంజినీర్, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top