సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన నేడు తాడేపల్లిలో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు.
నిన్న పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, ఎన్నికల పరిశీలకులతో జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మేయర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థులపై కసరత్తు సాగనుంది.
అభ్యర్థుల ఖరారుపై ఫోకస్!
నేటి సమావేశంలో మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక, స్థానికంగా పార్టీ పరిస్థితులు, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు, స్థానిక నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కసరత్తు జరగనుంది.
మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల నిర్వహణలో నేతలకు బాధ్యతలు అప్పగించడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. ఇవాళ షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో వరుస సమావేశాలతో జగన్ అభ్యర్థుల ఖరారు, వ్యూహరచనపై దృష్టి సారించారు.
నేడు మున్సిపల్, పరిషత్ ఎన్నికల షెడ్యూల్
మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ బుధవారం ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు 661 జెడ్పీటీసీ, 9,983 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరో విడతలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ జరిగే అవకాశముందని సమాచారం. అన్ని జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు బుధవారం తెల్లవారుజాముకల్లా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మంగళవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. మూడో దశలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి; స్థానిక ఎన్నికల ఓట్లను ఒకేసారి లెక్కించాలి


