పోలీసులు, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
కలెక్టరేట్లు, ఆర్డీవో ఆఫీసుల్లో నామినేషన్లకు వీలు కల్పించాలి
కులధ్రువీకరణ పత్రాలు ఆఫీసుల్లో కూడా ఇవ్వాలి
సున్నిత అంశాలపై తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలి
రాజకీయ పార్టీల సమావేశంలో ఎస్ఈసీని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వల్ప వ్యవధిలో జరుగుతున్న నేపథ్యంలో ఒక ఎన్నికల ఫలితాలు మరో ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్లను ఒకేసారి లెక్కించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వైఎస్సార్సీపీ తరఫున మాజీమంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కన్నబాబు, మహేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తాము చేసిన డిమాండ్లను వివరించారు. కన్నబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పోలీసులు, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని తాము ఆశిస్తున్నప్పటికీ, ఇప్పటికే జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల అనుమానాలు కలుగుతున్నట్టు చెప్పారు. కులధ్రువీకరణ పత్రాలను కేవలం యాప్ ద్వారానే తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలంటే సాంకేతిక సమస్యలు, ఇతర ప్రభావాల వల్ల సకాలంలో అందవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల మీ సేవా కేంద్రాలు, ఆఫీసుల్లో నేరుగా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో కులధ్రువీకరణ పత్రాలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరినట్టు చెప్పారు. విశాఖ, గుంటూరు నగరాల్లో నోడ్యూస్ సర్టిఫికెట్ల జారీ విషయంలో జరిగిన పక్షపాత ఘటనలను ఎస్ఈసీకి వివరించామన్నారు. అభ్యర్థులు కులధ్రువీకరణ, నోడ్యూస్ సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నేత అప్పిరెడ్డి ఇప్పటికే మూడుసార్లు ఎస్ఈసీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అభ్యర్థులకు తగిన భద్రత కల్పించే బాధ్యతను ఎస్ఈసీ తీసుకోవాలని కోరామన్నారు. గతంలో ఘర్షణలు జరిగిన సున్నితప్రాంతాల్లో కేంద్ర బలగాలతో గస్తీ ఏర్పాటు చేయాలని సూచించినట్టు చెప్పారు. జూలై 15 నాటికి అర్హత గల ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించాలని తమ పార్టీ గతంలో ఎస్ఈసీకి లేఖ రాసిందని గుర్తుచేశారు.
కోడ్‌ను కఠినంగా అమలు చేయాలి
ఎన్నికల నియమావళి (కోడ్)ని కఠినంగా అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ, మీడియా సున్నితమైన అంశాలపై చేపడుతున్న తప్పుప్రచారాలను అడ్డుకోవాలని కోరామన్నారు. నోటిఫికేషన్ రోజు నుంచే బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతర లైవ్ వీడియో అందరికీ అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. నగరాలు, మున్సిపాలిటీల్లో వార్డుల విభజన అస్తవ్యస్తంగా జరిగినట్లు చెప్పామన్నారు. విశాఖపట్నంలో 30 వేల ఓట్లతో ఏర్పాటు చేసిన డివిజన్ పక్కనే.. మరో డివిజన్‌ను ఐదువేల ఓట్లతో ఏర్పాటు చేశారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
అక్రమాలను అడ్డుకుంటాం
కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులు కలెక్టరు, ఆర్డీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని ఎస్ఈసీని కోరినట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే పారామిలటరీ బలగాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే పోలీసులు తమ నాయకులను బైండవర్లు పేరిట బెదిరిస్తున్నారని చెప్పినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ వీడియోలు 90 రోజులు భద్రపరిచేలా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోయినా, నామినేషన్లు వేయనీయకపోయినా రాష్ట్రంలో విప్లవం వస్తుందని హెచ్చరించారు. దొంగతనంగా, అక్రమాలు చేసి గెలవాలనుకుంటే అన్ని రకాలుగా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


