తప్పుడు పోస్టులపై వైఎస్‌ భారతీరెడ్డి లీగల్‌ నోటీసులు | Legal notices to Google YouTube Meta X legal action against false posts | Sakshi
Sakshi News home page

తప్పుడు పోస్టులపై వైఎస్‌ భారతీరెడ్డి లీగల్‌ నోటీసులు

Apr 18 2026 4:22 AM | Updated on Apr 18 2026 1:15 PM

Legal notices to Google YouTube Meta X legal action against false posts

గూగుల్‌, మెటా, ఎక్స్‌, యూట్యూబ్‌లకు వైఎస్‌ భారతీరెడ్డి నోటీసులు

తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న థింక్‌ ఆంధ్ర, ఎం9 న్యూస్‌లకు కూడా నోటీసులు

తక్షణమే ఆ కథనాలను.. పోస్టులను తొలగించాలి

ఆ కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను బ్లాక్‌ చేయాలి

తప్పుడు కథనాలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్న వైఎస్‌ భారతీరెడ్డి న్యాయవాది ప్రద్యుమన్‌

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. 

తనపై సర్క్యులేట్‌ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికలు మెటా ప్లాట్‌ఫామ్స్, ఎక్స్‌ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్‌లకు లీగల్‌ నోటీసులు పంపారు. భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్‌ కైస్తా ఈమేరకు నోటీసులిచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులను ప్రచారం చేస్తున్న థింక్‌ ఆంధ్ర, ఎం9 న్యూస్‌లకు సైతం నోటీసులు పంపారు.

భారతీరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి బాధితులుగా మారారు..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్‌ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి.. అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ఖాతాలు కలిగిన థింక్‌ ఆంధ్ర.. తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి 9 న్యూస్‌ కూడా ఇలాంటి కంటెంట్‌నే సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. 

ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్‌ పనే..
ఈ కంటెంట్‌ను భారతీరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్‌కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో థింక్‌ ఆంధ్రా ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. 

ప్రణాళికబద్ధంగా సాగుతున్న దాడి...
వైఎస్‌ జగన్‌ దంపతులపై దుష్ప్ర­చారం చేయాలనే ఉద్దేశంతోనే ఆ తప్పుడు కథనాలు, పోస్టు­లను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగు­తున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్‌ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతీరెడ్డి వ్యకిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. 

ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చేస్తు­న్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామా­జిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్‌ చేయాలి. లేని పక్షంలో భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. 

ప్రస్తుత లీగల్‌ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్‌ అయినా, అలాగే నా క్లయింట్‌కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, మళ్లీ ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్‌లోడ్‌ చేయడం, స్ట్రీమింగ్‌ చేయడం, ప్రచారం చేయడం, షేర్‌ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ కంటెంట్‌ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..’ అని ప్రద్యుమన్‌ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement