
ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు
ఇబ్రహీంపట్నంలో రెండు చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్లు, తయారీ యంత్రాలు
ఉమ్మడి కృష్ణా, కోస్తా జిల్లాల్లోని వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా
రెండు గదుల నిండా స్పిరిట్ ఖాళీ క్యాన్లు
ఖాళీ సీసాలు, వివిధ కంపెనీల లేబుళ్లు స్వాధీనం
స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలతో జనావాసాల్లోనే యథేచ్ఛగా తయారీ
జనార్దన్ బార్‌ను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి నెట్‌వర్క్: రంగు, వాసన, ఏమాత్రం తేడా లేకుండా కార్మెల్, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం తయారీ... ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌కు నకిలీ సరుకు సిద్ధం... అక్కడ ఎటుచూసినా.. కార్టన్ బాక్స్‌ల్లో స్పిరిట్ నింపిన క్యాన్లు.. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించిన నకిలీ మద్యం బాటిళ్లే.. ఎవరికీ అనుమానం రాకుండా బాక్సుల్లో అమర్చి పాల వ్యాన్లలో సరఫరా! ఏకంగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నడుమ నకిలీ మద్యం తయారీ!
విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా పచ్చముఠాలు, కల్తీ కేటుగాళ్లు సాగించిన నకిలీ మద్యం దందా ఇదీ!! తాజాగా అక్కడ తనిఖీల్లో భారీగా బయటపడ్డ స్పిరిట్ ఖాళీ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్‌లో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారంటే ఏ స్థాయిలో దందా సాగిందో ఊహించవచ్చు.
పాత ఏఎన్నార్ బార్ భవనంలో నకిలీ తయారీ..
టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాలవారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తోంది. బరి తెగించి అన్ని చోట్లా మద్యం, బెల్ట్ షాపులకు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసి రూ.కోట్లు పిండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్ బార్ సమీపంలోని గోడౌన్, హైవే పక్కన ఉన్న పాత ఏఎన్నార్ బార్ (ఖాళీ భవనం)లో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
గోడౌన్‌లో సుమారు 162 కేసుల మద్యం సీసాలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్‌లు, మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, బ్లెండ్ (క్యారామిల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ద్రావణం), పెద్ద సంఖ్యలో ఖాళీ సీసాలు, పలు కంపెనీల లేబుల్స్, సీసాలకు బిగించే మూతలు, మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్నార్ బార్ భవనంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్పిరిట్, క్యారామిల్ ద్రావణం కలిపేందుకు వినియోగిస్తున్న పీవీసీ ట్యాంక్, వివిధ రంగులు మిక్స్ చేసే యంత్రాలు లభ్యమయ్యాయి.
రెండు గదుల నిండా ఉన్న స్పిరిట్ ఖాళీ క్యాన్లు, రెండు పెద్ద స్టీల్ డ్రమ్ములు, మద్యం తయారీ సామగ్రిని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఏడాదిన్నరగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ రాకెట్ నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని ఏఎన్‌ఆర్ బార్‌తో పాటు జనార్దన్‌రావుకు వాటాలున్న కంచికచర్ల, భవానీపురంలోని శ్రీనివాస వైన్స్‌లో విక్రయాలు చేస్తుంటారు. వీటితో పాటు కొండపల్లి, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, కోస్తా జిల్లాలోని పలు వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇక్కడి నుంచే నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన అట్టపెట్టెలపై చింతలపూడి మండలం, పేదవేగి మండలం అని రాసి ఉండటం గమనార్హం.
టీడీపీ ప్రజాప్రతినిధి అండతో..
జనార్దనరావుకు స్థానిక టీడీపీ కీలక నేతలతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదితో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి అండదండలు లేకుండా జనావాసాల మధ్య పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. జనార్దనరావు సోదరుడు అద్దెపల్లి జగన్‌మోహనరావు, మరో నిందితుడు కట్టా రాజును రెండు రోజులుగా విచారించడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దనరావుకు చెందిన ఏఎన్నార్ బార్‌ను ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
కూటమి అధికారంలోకి రావడంతో..
ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తంబళ్లపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డితో స్నేహం ఏర్పడింది. నిషేధించిన ప్రాంతంలో సుమారు పదేళ్ల క్రితం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నకిలీ సర్టిఫికెట్‌తో ఏఎన్నార్ బార్ ఏర్పాటు చేశాడు. 2024 ఎన్నికల ముందు తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అ«ధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె, ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు.
అమాయకులు బలి..
రూ.99కే నాణ్యమైన మద్యం వైన్ షాపుల ద్వారా విక్రయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు సమీపంలోని ఓ వైన్స్‌లో ఇటీవల దాములూరుకు చెందిన వ్యక్తి మద్యం తాగిన కొద్దిసేపటికి అక్కడే మృతి చెందాడు. జూపూడి వైన్స్‌లో కిలేశపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మద్యం తాగి ఇంటికి వెళుతూ దారిలో మృత్యువాత పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో అక్రమ మద్యం వ్యాపారులు మృతుల కుటుంబాలతో రాజీ కుదుర్చుకున్నారు. ఇక వెలుగు చూడని కల్తీ మద్యం చావులు మరెన్నో ఉన్నాయి.
నకిలీ మద్యంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇంతకాలం తాము తీసుకున్నది నకిలీ మద్యం అని తెలియడంతో మద్యం ప్రియులకు నోట మాట రావడం లేదు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో తెనాలి ఐతానగర్‌కు చెందిన కొడాలి శ్రీనివాసరావును ఏ–12గా చేర్చారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న భవనం లీజు అగ్రిమెంటు శ్రీనివాసరావు పేరుతో ఉండడంతో ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారు.
కాగా తెనాలిలోని శ్రీనివాసరావు ఇంట్లో ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎలాంటి సామగ్రి లభ్యం కాలేదని తెలుస్తోంది. కాగా నకిలీ మద్యంతో తంబళ్లపల్లె టీడీపీ నాయకులకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లె జనార్దనరావు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని తెలిపాడు.
భారీగా నకిలీ మద్యం సీజ్..
ములకలచెరువు నుంచి అందిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నంలోని గోడౌన్‌పై దాడులు చేశాం. దాడుల్లో నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్ , పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, ఎటువంటి లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్‌ను సీజ్ చేశాం. గోడౌన్‌లో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో (ఒక్కో క్యాన్ 35 లీటర్లు) 3,325 లీటర్ల స్పిరిట్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ 384 బాటిళ్లు, మంజీర బ్లూ 24 బాటిళ్లు మొత్తం 1,272 బాటిల్స్ సీజ్ చేశాం.
లేబుల్స్ లేని మద్యం 136 కేసులు, 6578 బాటిల్స్ , ఓఏబీ లేబుల్స్ 6500, ఖాళీ బాటిల్స్ 22,000, ఖాళీ క్యాన్లు 6, పైపులు 2, మిషన్–1 సీజ్ చేశాం. ఏ–1 ముద్దాయి అద్దెపల్లి జనార్దనరావు సోదరుడు జగన్‌మోహన్‌రావును అదుపులోకి తీసుకుని విచారించాం. జనార్దన్ సన్నిహితుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం గోడౌన్‌ను తనిఖీ చేశాం. జనార్దనరావు స్వదేశానికి రాగానే అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్, విజయవాడ