Number Plates: దొరికితే వదిలేదే లే!

Kurnool Police Crackdown on Tampered Number Plates - Sakshi

నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలపై నిఘా

వారంలో 75 వాహనాలు సీజ్‌ 

తప్పుడు నంబర్లతో ప్రయాణిస్తే కేసులు 

జిల్లా అంతటా కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌ 

సాక్షి, కర్నూలు: పోలీసులు తనిఖీ చేస్తున్నారట.. ఫొటో తీసి నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏం చేద్దాం.. ప్లేట్‌ను వంచేద్దాం లేదా చివర్లను విరగ్గొడదాం లేదా ప్లేటే తీసేద్దాం అప్పుడెలాంటి జరిమానాలు రావు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు చేస్తున్న ఆలోచన ఇదీ. 

ప్రమాదాల నియంత్రణకు చర్యలు 
రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాఅంతటా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం ద్విచక్ర వాహన చోదకులే ఉంటున్నారు. వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను విస్మరించిన వారికీ నష్టాలు తప్పవని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.

ఇలాంటి వాహనాలు చోరీకి గురైనప్పుడు గుర్తింపు అసాధ్యంగా మారుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో వాహన చోదకుడు నష్టపోతే ఫిర్యాదు చేయడం కూడా ఇబ్బందికరమే. జిల్లాలో సుమారు 10 శాతం మేర వాహనాలు నంబర్‌ ప్లేట్‌ లేకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసుల అంచనా. నంబర్‌ ప్లేట్‌ లేకపోయినా, రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోయినా వాటిని పోలీసులు స్వాధీనం  చేసుకుంటున్నారు. 

విరిగిందన్న సాకుతో.. 
ప్రస్తుతం వాహనాలన్నింటికీ హైసెక్యురిటీ నంబర్‌ ప్లేట్‌ బిగిస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ నంబర్‌ ప్లేట్‌లు విరిగిపోతున్నాయి. ఫలితంగా వాహన నంబర్లను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్‌ గుర్తించకుండా ప్లేట్‌ను విరగ్గొట్టడం చేస్తున్నారు. దీనివల్ల నిబంధనలు అతిక్రమించినప్పుడు వాహనాలకు జరిమానా విధించాలన్నా, కేసులు సమోదు చేయాలన్నా అధికారులకు తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వాహనాలన్నీ విధిగా నంబర్‌ ప్లేట్‌ కలిగి ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. హైసెక్యురిటీ నంబర్‌ ప్లేట్‌ ఉండి విరిగిపోయినా, దెబ్బతిన్నా వాటిస్థానంలో కొత్త ప్లేట్‌ బిగించుకోవాలని సూచిస్తున్నారు. మోటారు వాహన చట్టం నిబంధనలకు లోబడి సిరీస్, అంకెలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి లేకుంటే జరిమానాలు విధిస్తున్నారు.  

చదవండి: (వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం)

నంబర్‌ ప్లేట్‌తోనే వాహనం గుర్తింపు  
రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ఏర్పాటు చేసుకునే నంబర్‌ ప్లేట్‌తోనే వాహనాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని విస్మరిస్తున్న పలువురు వాహన చోదకులు ఉల్లంఘనుల జాబితాలో చేరుతున్నారు. కనీస నిబంధనలు పాటించక చిక్కుల్లోకి వెళ్తున్నారు. నంబర్‌ ప్లేట్‌ రహితంగా, ఇష్టారీతిన నంబర్‌ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వందల సంఖ్యలో జనాలు ఈ జాబితాలో చేరుతుండటం గమనార్హం. వారం రోజుల వ్యవధిలో ఉల్లంఘనలకు పాల్పడిన 7,932 మందిపై ఈ–చలానాలు విధించి రూ.21.26 లక్షలు జరిమానా వసూలు చేశారు.

వారంలో కనీసం వందకు పైగా నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల్లో సుమారు 75 ద్విచక్ర వాహనాలు నంబర్‌ ప్లేట్‌లు లేకుండా పట్టుబడ్డాయి. అలాగే ఇష్టారీతిన నంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు చేసుకున్నవి 150 దాకా పట్టుకున్నారు. నిర్దేశిత వ్యవధి దాటినప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాహనాలు కూడా తనిఖీల్లో పట్టుబడుతున్నాయి.  

కనిష్టంగా వెయ్యి జరిమానా.. 
నంబర్‌ ప్లేట్‌ లేకపోవడం, సరిగా అమర్చుకోకపోవడం, రిజిస్ట్రేషన్‌ అయినప్పటికీ అక్షరాలు, అంకెలు కనిపించకుండా మార్పులు చేయడం, వెనుకవైపు ప్లేట్‌ను తీసివేయడం, ప్లేట్‌ను వంపు చేయడం తదితర అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. ఉల్లంçఘనలకు పాల్పడిన వారికి కనిష్టంగా వెయ్యి జరిమానా విధిస్తున్నారు. నంబర్‌ ప్లేట్‌ లేకపోయినా, రాంగ్‌ రూట్‌లో ప్రయాణించినా సిగ్నల్‌ జంపింగ్‌ చేసినా, రికార్డులు అందుబాటులో లేకపోయినా, పొల్యూషన్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ పత్రం లేకపోయినా రూ.1000, లైసెన్స్‌ లేకపోతే రూ.500, హెల్మెట్‌ లేకపోతే రూ.100, నోఎంట్రీకి రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారు.  

ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యం       
ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదారులపై జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించాం. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, రిజిస్ట్రేషన్‌ లేకుండా వాహనం రోడ్డుపైకి వచ్చినా పోలీసులు వాటిని జప్తు చేస్తారు. ఇష్టారీతిన నంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు చేసుకోకుండా తనిఖీల్లో పట్టుబడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. 
– ఎస్పీ, సిద్ధార్థ్‌ కౌశల్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top