రైతు భరోసా యాత్రలకు శ్రీకారం

Kurasala Kannababu Starts YSR Rythu Bharosa Yatra In East Godavari District - Sakshi

వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యం 

ఆర్‌బీకేల స్థాయిలో ఈ నెల 23 వరకు నిర్వహణ 

కాకినాడ రూరల్‌లో ప్రారంభించిన వ్యవసాయ మంత్రి కన్నబాబు 

రైతులతో శాస్త్రవేత్తలు, నిపుణుల ముఖాముఖి 

సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. వీటిని వివరిస్తూనే రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఈ–క్రాపింగ్‌ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో వైఎస్సార్‌ రైతు భరోసా యాత్రలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశు సంవర్ధక శాఖల సమన్వయంతో ఈ నెల 23 వరకు  యాత్రలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10,544 ఆర్‌బీకేల్లో ఈ యాత్రలకు శ్రీకారం చుట్టారు. వీటిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. వీరంతా గ్రామాల్లో కలియ తిరుగుతూ రైతులతో మమేకమయ్యారు. 

రైతుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం 
వైఎస్సార్‌ రైతు భరోసా యాత్రలకు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్‌బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన సీహెచ్‌సీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన యాత్రల్లో తొలుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని వినిపించారు.

యాత్రల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే వారి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఖరీఫ్‌ సాగు సన్నద్ధత, మార్కెటింగ్‌కు అనువైన రకాల సాగు, యాజమాన్య పద్ధతులు, ఇతర మెళకువలపై శాస్త్రవేత్తలు వివరించారు. రైతులతో ముఖాముఖిలో వారడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సాగు పద్ధతులపై నమూనా ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేశారు. ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్న యంత్ర పరికరాలు, వాటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు.

సద్వినియోగం చేసుకోండి.. 
సాగులో తీసుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. సీఎం యాప్, ఈ–క్రాపింగ్‌ బుకింగ్‌ ఆవశ్యకతపై వివరిస్తాం. శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు రైతులతో భేటీ అవుతూ క్షేత్ర స్థాయిలో వారెదుర్కొనే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపుతారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. 
– హెచ్‌.అరుణ్‌కుమార్,
కమిషనర్, వ్యవసాయ శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top