ఎల్లో మీడియా కుట్రపూరిత కథనాలు.. సీఎస్‌ జవహర్‌రెడ్డి హెచ్చరిక

KS Jawahar Reddy Fires On Yellow Media - Sakshi

ఓఎస్డీతో కలసి నేను విజయవాడ వెళ్లినట్లు అభూత కల్పనలు

ఉద్యోగులందరిలో అత్యున్నత స్థాయి అధికారిని టార్గెట్‌ చేస్తూ అవాస్తవాలా?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ జర్నలిజం విలువలు?

బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే.. తప్పుడు కథనాలపై నా ఖండనను అంతే ప్రాధాన్యతతో ప్రచురించాలి

లేదంటే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తప్పవు

సీఎస్‌ జవహర్‌రెడ్డి హెచ్చరిక

సాక్షి, అమరావతి: ‘సీఎస్‌తో కలసి వెళ్లిన ఓఎస్డీ’ శీర్షికన ఎల్లో మీడియా ప్రచురించిన కథనా­లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. దారుణమైన అబద్ధాలను ఆలంబనగా చేసు­కుని ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్, ఏబీఎన్‌ చానల్‌ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ అధినేత అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చులకన చేస్తూ, కుట్రపూరితంగా కట్టుకథలు అల్లాయని స్పష్టం చేశారు.

ఓ అత్యున్నత స్థాయి అధికారిని, వ్యవస్థను కించపరుస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఉద్యోగులందరిలో అత్యున్నతస్థాయి అధికారిని టార్గెట్‌ చేస్తూ అవాస్తవాలను ప్రచురించడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా ఏ జర్నలిజం విలువల ఆధారంగా పని చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. తాను ఖండనలో పొందుపరిచిన అన్ని విషయా­లను అంతే ప్రాధా­న్యతతో, బేషరతుగా క్షమాపణలు చెబుతూ ప్రచురించాలన్నారు.

ఫిబ్రవరి 4వ తేదీన సత్యదూరమైన న్యూస్‌ ఐటమ్‌ను ఆయా పత్రికల్లో ఏ పేజీల్లో ఎంత ప్రాముఖ్యతతో ప్రచురించారో, ఏ సమయంలో ఎంత ప్రాధాన్యతతో చానల్‌లో కథనా­లను ప్రసారం చేశారో అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యతతో ఖండనను ప్రసారం చేస్తూ జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆ న్యూస్‌ ఐటమ్‌కు బాధ్యులపై న్యాయ నిపుణుల సలహా, ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సీట్‌ నంబర్‌ 1 డి... వెళ్లింది హైదరాబాద్‌  
వైఎస్సార్‌ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీపంలో రూ.5 కోట్లతో పునర్నిర్మించిన శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకాన్ని ఫిబ్రవరి 4వతేదీ ఉదయం 9.58 గంటలకు నిర్వహించాలని ముహూర్తాన్ని నాలుగు నెలల క్రితమే 2022 అక్టోబర్‌ 14 నిర్ణయించారని సీఎస్‌ తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను ఫిబ్రవరి 2వతేదీ రాత్రి 11 గంటలకు రేణిగుంట ద్వారా కడప చేరుకున్నట్లు వివరించారు.

3వ తేదీ ఉదయం 9.50 గంటలకు కడప కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాను చదువుకున్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ముద్దనూరులో విద్యార్ధులతో సమావేశం ముగియగానే 4.40కి బయలుదేరానని, సుమారు 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్, ఇతర అధికారులు తనకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారని తెలిపారు.

రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్‌ ఎస్‌జీ 3003 సిరీస్‌ ద్వారా 1 డి సీట్‌లో ప్రయాణించి హైదరాబాద్‌ చేరుకున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే శుక్రవారం రోజు సీఎస్‌తో కలసి ఓఎస్డీ విజయవాడ వెళ్లారని, ఒకే వాహనంలో ప్రయాణించారని  ప్రచురించిన కథనాలు ఊహాజనితం, సత్యదూరమని చెప్పారు. దారుణమైన ఈ అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top