పద్ధతి మార్చుకోపోతే కఠిన చర్యలు తప్పవు

Krishna District SP Siddharth Kaushal Mega Counselling At Vijayawada - Sakshi

పాత నేరస్తులకు కృష్ణా జిల్లా ఎస్పీ వార్నింగ్‌

నేరాలు తగ్గించేందుకు ప్రత్యేక యాక్షన్‌ 

సత్ప్రవర్తనతో నడుచుకునే వారికి ఉద్యోగవకాశాలు

పాత నేరస్తులకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తనదైన శైలిలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నేరాలు చేయడం మానకపోతే కఠిన చర్యలు తప్పవని ‘ఓపెన్‌’గా వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. 

సాక్షి, విజయవాడ: సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే సహించేది లేదని, పద్ధతి మార్చుకోకుండా తిరిగితే రౌడీషీట్లు తెరిచి, చట్టరీత్యా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ హెచ్చరించారు. మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కా వంటి వాటిని అక్రమ రవాణా చేసే జిల్లాలోని ఐదు డివిజన్లకు చెందిన 2,530 మంది పాత నేరస్తులకు సింగ్‌నగర్‌ మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  

► ఎస్పీ మాట్లాడుతూ కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆరాటంతో కొంతమంది వ్యక్తులు మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కాల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారన్నారు.

► చదువుకున్న వారు, యువకులు కూడా ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉండడం బాధాకరమన్నారు.

► ఈ కేసుల్లో పట్టుపడితే ఏముంటుందిలే, బెయిల్‌ మీద వస్తాం, చక్కగా తిరిగేస్తామనుకొని ఇప్పటివరకూ పదే పదే తప్పులు చేస్తూ కొంతమంది  నడుచుకుంటున్నారన్నారు.  అటువంటి వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు.

నేరాల అదుపునకు యాక్షన్‌ ప్లాన్‌ 
కృష్ణా జిల్లాలో ఈ నేరాల సంఖ్యను పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించామని ఎస్పీ తెలిపారు. జియో ట్యాగింగ్‌ ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో అదనంగా మరికొన్ని చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి, సరిహద్దు గ్రామాలు, నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, అమ్మోనియా, పటిక వంటి నిల్వలపై నిరంతర తనిఖీలు, ఫుడ్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. 

సత్ప్రవర్తనతో ఉంటే ఉద్యోగావకాశాలు.. 
నేరాలు విడిచి సత్ప్రవర్తనతో నడుచుకునే వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్‌ మేళాలను నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈబీ జేడీ మోకా సత్తిబాబు, జిల్లాలోని పలువురు ఏఎస్పీలు, డీఎస్పీలు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top