గూగుల్‌లో వెన్నుపోటు అని కొడితే చంద్రబాబు ఫొటో వస్తుంది: కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana Slams On Chandrababu Over Yellow Media - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఎల్లో మీడియా వారి ఇష్టమొచ్చిన రీతిలో ప్రభుత్వం మీద బురద చల్లుతూ, ప్రతి పథకాన్ని ఎవరికి ఉపయోగపడటం లేదని మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విచక్షణ కోల్పోయి దారుణంగా రాసే రాతలకు ప్రజలకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా ఆనాడు అంత అవినీతి జరిగితే ఈ మీడియా ఎప్పుడైనా ప్రచురించిందా? అని సూటిగా ప్రశ్నించారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ పని చేసిన ప్రజలకు అన్ని రకాలుగా లబ్ధిపొందే విధంగా ఆలోచించి చేస్తారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ధైర్యానికి తట్టుకోలేక ఈ విధంగా భయపడి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందుతుంటే, ఇది ఇలాగే ఉంటే టీడీపీ మనుగడ కష్టమని ఈ విధంగా విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు.

మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించి అందులో ఉన్న ప్రతీ హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రం అప్పులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు. పోనీ అప్పు చేసి ఎవరైనా దోచేసుకుని తినేశారా? అది ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని నిలిపివేస్తామని మీరు ప్రజలకు చెప్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు.

25 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరుతుందని గుర్తుచేశారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి మార్చింది కనపడటం లేదా? అని ప్రశ్నించారు. 31 లక్షల మంది సొంతఇళ్లు లేని కుటుంబాలకు ఒక మహా యజ్ఞం లాగా సొంతఇళ్లు అందచేస్తున్నామని పేర్కొన్నారు. దానికి కూడా కోర్టులో కేసులు వేసి, అడ్డగించే పనులు చేయడం లేదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు అభిప్రాయాలు అన్ని మాజీ ఐఏఎస్‌ అధికారులతో చెప్పించి, ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల విద్యుత్ సంక్షోభం వస్తుందని ప్రచారం చేయడం ఎంత దారుణమని మండిపడ్డారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఈరోజు నిష్పక్షపాతంగా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అందిస్తున్న తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా సహకారంతో బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. వెన్నుపోటు పొడవడం గురించి గూగుల్‌లో కొడితే చంద్రబాబు ఫోటోనే వస్తుందని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top