
అత్యంత ప్రమాదకరం గిరినాగులు
పాపికొండల అభయారణ్యంలో సంచారం
గిరినాగులు 14 నుంచి 20 అడుగుల పొడవు ఉంటాయి
మగ గిరినాగులను ఆకర్షించేందుకు ఆడ గిరినాగులు ఫెర్మోన్స్ అనే రసాయన పదార్థానాన్ని వెదజల్లుతాయి. ఆ వాసన బట్టి మగ గిరినాగులు వాటిని అనుసరిస్తాయి
గిరినాగులు రక్తపొడ, తాచుపాము, కట్లపాము, జెర్రిగొడ్డు వంటి పాములను ఆహారంగా స్వీకరిస్తాయి
గిరినాగులు గుడ్లు పెట్టి 18 రోజులపాటు పొదుగుతాయి. 21వ రోజున పిల్లలు బయటకు వస్తాయి
పాపికొండల అభయారణ్యంలోని జలతారువాగు ప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది
గిరినాగులు కాటు వేస్తే 10 నిమిషాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది
గిరినాగు (కింగ్ కోబ్రా) అత్యంత ప్రమాదకరమైన సర్పం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. అరుదైన సర్పజాతికి చెందిన గిరినాగులకు ఇతర పాములే ఆహారం. వర్షాకాలంలో పాములను తినేందుకు ఇవి బయటకు వస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు సమీపంలో వీటి జాడ ఎక్కువగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. అరుదైన గిరినాగులు కనిపిస్తే చంపవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల మధ్య 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల జాతీయ వన్య మృగ అభయారణ్యం విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నిలయంగా ఉన్న ఈ అభయారణ్యంలో గిరి నాగుల సంచారం ఎక్కువగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతాలకు పరిమితమయ్యే ఈ సర్పాలు అత్యంత విషపూరితం. అలాగే ఇవి అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇటీవల ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో గిరినాగులు కనిపించినట్టు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యంలోని జలతారు వాగు పరిసర ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయని వైల్డ్ లైఫ్ అధికారులు అంటున్నారు.
ఆహారం కోసం బయటకు..
మార్చి నుంచి జూలై వరకు గిరినాగులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో జల వనరులు తగ్గినప్పుడు నీటి చెమ్మను వెతుక్కుంటూ బయటకు వస్తుంటాయి. రబీ సీజన్ అనంతరం ఇతర పాములు పొలాల్లో ఉండటంతో ఆహారం కోసం వాటిని వెతుక్కుంటూ గిరినాగులు వస్తుంటాయి. గతేడాది వర్షాకాలంలో బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం సమీపంలో, ఇనుమూరు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం అటవీ ప్రాంతంలో, ఇటీవల గడ్డపల్లి, ముంజులూరు, తంగేడికొండ, దారావాడ, కోండ్రుకోట అటవీ ప్రాంతాల్లో గిరినాగులు కనిపించినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో గిరినాగులతో పాటు పది అడుగుల తాచుపాములు, రక్తపింజర వంటి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి.
పట్టుకుని అడవిలో వదిలేస్తూ..
ఇటీవల కాలంలో వర్షాకాలంలోనూ గిరిజనులు పొలాల్లో సంచరిస్తున్నాయి. వీటి సమాచారం అందిస్తే ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇవి అరుదైన పాములు కావడంతో వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
20 అడుగుల పొడవు
గిరినాగు పాము చాలా ప్రమాదమైంది. 20 అడుగుల పైగా పొడవు ఉంటుంది. బాగా ముదిరిన పాము చాలా డేంజర్. నేను చాలాసార్లు వాటిని చూశాను. అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అవి కనిపిస్తే పరుగులు తీసేవాళ్లం. –ఎస్.ప్రసాద్, బుట్టాయగూడెం
మనుషులపై దాడి చేయవు
గిరినాగులు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే వాటిని భయపెట్టడం లేదా రెచ్చగొట్టడం చేస్తే కాలువేస్తాయి. ఇది చాలా విషపూరితమైన పాము. కాటు వేస్తే మరణమే తప్ప జీవించే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. –గంధం విక్టర్, బుట్టాయగూడెం
సమాచారం ఇవ్వండి
పశి్చమ ఏజెన్సీ ప్రాంతంలో గిరినాగులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. ప్రాణభయంతో పాములను చంపవద్దు. మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం. ఈ పాములు అరుదైనవి. అభయారణ్యంలో వణ్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. –ఎస్‌కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరం
అత్యంత ప్రమాదకరం
గిరినాగులు అత్యంత ప్రమాదకరం. వీటిని పట్టుకోవడం అంత సులువు కాదు. పాపికొండలు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నట్టు ఫోన్‌లు వస్తున్నాయి. గిరినాగు పాము కనిపిస్తే ఎవరూ చంపవద్దు. 8099855153 నంబర్‌కు ఫోన్ చేస్తే నేను పట్టుకుని అడవిలో వదిలేస్తా. –చదలవాడ క్రాంతి, స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, జంగారెడ్డిగూడెం