గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు

Published Thu, Jul 27 2023 4:30 AM

Karunya appointments in village and ward secretariats - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పు­న ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభు­త్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్ప­టివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యో­గాలు కల్పించింది.

మిగిలిన 1,149 మంది దరఖాస్తు­దారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖా­స్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియా­మకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా  సీఎస్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు. 

ఖాళీగా ఉన్న పోస్టులివే..
గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్య­దర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరి­పాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, తది­తర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పే­ర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. 

పోస్టుల భర్తీకి టైమ్‌లైన్‌..
ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. 

  • దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి.
  • సమ్మతి నివేదికను సెప్టెంబర్‌ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. 
  • మృతిచెందిన ఉద్యోగికి మైనర్‌ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 
  • ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. 
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి.  

Advertisement
 
Advertisement